అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణలతో మరోసారి పశ్చిమాసియా వేడెక్కింది. ఈ నేపథ్యంలో కుటుంబం శవపేటికలతో ‘రక్తానికి రక్తం’ అనే క్యాప్షన్‌తో ఇరాన్ భారీ బ్యానర్‌ను ప్రదర్శించింది. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులందరి ఫోటోలను శవపేటికల్లో ఉంచినట్లు చూపిస్తూ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున వివాదాస్పద బ్యానర్‌ను ఇరాన్ ఆవిష్కరించారు. ఈ శవపేటికలపై అమెరికా జాతీయ జెండా కప్పి ఉంది. మండిపోతున్న అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం బ్యాక్ డ్రాప్‌‌గా ఉన్న బ్యానర్‌లో డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్, వారి ఐదుగురు పిల్లలు ఇవాంకా, డాన్ జూనియర్, ఎరిక్, టిఫనీ, బారన్ ట్రంప్ ఫోటోలు ఉన్నాయి.అలాగే, పర్షియన్ భాషలో ‘రక్తానికి రక్తం’అనే నినాదంతో ఈ హోర్డింగ్ ఉంది. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడ్ని ఇరాన్ ఇరాన్ బెదిరించడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఒకసారి టెహ్రాన్‌లోని ఇంకైలాబ్ స్క్వేర్‌ వద్ద శవపేటికలో ట్రంప్ పడుకుని ఉన్నట్లు చూపిస్తూ పెద్ద బ్యానర్‌ను ఇరాన్ వేలాడదీసింది. నల్లటి శవపేటిక నుంచి ట్రంప్ శరీరం పైకి కనిపిస్తున్నట్లు, చెల్లాచెదురైన జుట్టు, మూసి ఉన్న కళ్లు, నోరు, పొట్టపై ఎర్రటి టై ఉన్నట్లు చిత్రించారు.ముందు నుంచి ప్రజా బాహుళ్యం ఉన్న ప్రాంతాలను ఇరాన్ తమ రాజకీయ ప్రచార సాధనాలుగా వాడుకుంటోంది. కానీ, అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రాజధానిలోని అత్యంత రద్దీ ప్రదేశాల్లో విప్లవాత్మక ఫోటోలు, యుద్ధ స్మారకాలు, సిద్ధాంతపరమైన సందేశాలతో కూడిన భారీ హోల్డింగులను తన వ్యూహాత్మక ప్రచారంలో భాగంగా ప్రదర్శిస్తోంది. టెహ్రాన్‌లోని వలియాస్ర స్క్వేర్‌లో ఉండే ఇలాంటి పెద్ద పెద్ద వాల్‌పోస్టర్లు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనుబంధ విభాగం 'ఓజ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్' రూపొందిస్తుంది.సుప్రీం లీడర్ మోజ్తాబా వార్నింగ్తన తండ్రి హత్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని గతవారం హెచ్చరించారు. ఆయన హత్యకు కారణమైనవారిని "ప్రశాంతంగా నిద్రపోనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం అనంతరం ఇరాన్ నాయకులు, ప్రభుత్వ అధికారిక మీడియా నిరంతరం ప్రతీకారం కోసం పిలుపునిస్తున్నాయి.‘‘ఈ ప్రతీకారం ఇరాన్ ప్రజల డిమాండ్.. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు పేర్లతో సహా తెలిసిన ఈ నేరగాళ్లు, తమ మంచాలపై ప్రశాంతంగా చావాలనే నెరవేరని కోరికతోనే సమాధుల్లోకి వెళ్తారు.. ఇది నా వ్యక్తిగత ఉనికిపై లేదా మరే ఇతర అధికారిక ఉనికిపై ఆధారపడి లేదని తెలుసుకోవాలి’’ అని తన తండ్రి అంత్యక్రియలు ముగిసిన మర్నాడు మోజ్తాబా ఓ సందేశం విడుదల చేశారు.తనను చంపితే ఏంచేయాలో చెప్పిన ట్రంప్మరోవైపు, ఇరాన్ గనుక తనను హత్య చేయడంలో విజయవంతమైతే.. ఆ దేశంపై ఊహించని స్థాయిలో భారీగా దాడులు చేయాలని అధికారులను తాను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం ప్రకటించారు. తాను చాలా కాలం నుంచి ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఉన్నానని న్యూయార్క్ పోస్ట్‌తో ట్రంప్ అన్నారు. ‘‘వారి హిట్‌లిస్ట్‌లో నేను ఉన్నాను. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితి అది... ఒకవేళ నాకు ఏదైనా జరిగితే ఇంతకు ముందెన్నడూ చూడని స్థాయిలో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాలని నేను స్పష్టం చేశాను’’ అని ఆయన అన్నారు.బాగ్దాద్ విమానాశ్రయంలో రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ అధికారి ఖాసీం సులేమానీని అమెరికా సైన్యం డ్రోన్ దాడితో హతమార్చినప్పటి నుంచి ట్రంప్ వారికి ప్రధాన లక్ష్యంగా మారారు. ఇటీవల అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్.. తిరిగి ప్రయాణంలో తన ప్రణాళికలను ఆకస్మికంగా మార్చుకున్నారు. దీనిని అధ్యక్షుడి భద్రత కోసం తీసుకున్న వ్యూహాత్మక చర్యగా వైట్‌హౌస్ తర్వాత ధ్రువీకరించింది.