ఏడాదిన్నరలోనే రూ.20 కోట్లకు అగ్రి కంపెనీ.. 23 ఏళ్ల హైదరాబాద్ యువకుడు సక్సెస్ స్టోరీ

Wait 5 sec.

వ్యాపారం లేదా కంపెనీలో అనేక ఏళ్ల అనుభవం ఉంటనే విజయం వరిస్తుందని అనుకోలేం.. కొన్నిసార్లు స్పష్టమైన లక్ష్యం, అకుంఠిత దీక్ష, కఠోర సాధన, అడుగు ముందుకేసే ధైర్యం ఉంటే చాలు. సరిగ్గా అలాంటి కోవకు చెందుతాడే ఈ హైదరాబాదీ యువకుడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అతడు తీసుకున్న నిర్ణయం విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టింది. కేవలం ఏడాదిన్నరలోనే అతడి సంస్థ రూ.20 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. హైదరాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడు బీబీఏ గ్రాడ్యుయేట్ గోపిశెట్టి సాయితేజ సక్సెస్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వోక్స్‌సేన్ యూనివర్సిటీ నుంచి బీబీఏ పూర్తిచేసిన సాయితేజ.. జనవరి 2025లో ల్యూమినారా లెగసీ పేరుతో అగ్రికల్చర్ స్టార్టప్ ప్రారంభించాడు. వ్యవసాయ రంగానికి అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, సూక్ష్మపోషకాలు, ఇతర సాగు పరిష్కరాలను అందించే ల్యూమినరా లెగసీ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించాడు. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తుల ద్వార రైతుల ఉత్పాదకతను పెంచడమే ఈ సంస్థ ముఖ్యోద్దేశం.‘‘ల్యూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు.. వ్యవసాయ విత్తనాలు, ఎరువుల స్టార్టప్‌ను నిర్మిస్తున్నాడు’’ అని ఎక్స్ (ట్విట్టర్)‌లో ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘అతడి కంపెనీ అయిన ల్యూమినారా లెగసీ ప్రైవేట్ లిమిటెడ్.. ప్రధానంగా వ్యవసాయ రంగం కోసం పనిచేస్తుంది. ఆధునిక వ్యవసాయ విధానాలను పెంపొందించి, రైతులకు సాధికారత కల్పించడానికి నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, స్థిరమైన వ్యవసాయ పరిష్కారాలను అందించడంలో ఇది ప్రత్యేకత కలిగి ఉంది’’ అని తెలిపారు.ఏడాదిన్నర కిందట ప్రారంభించిన ఈ స్టార్టప్ టర్నోవర్ ప్రస్తుతం రూ.20 కోట్లకు చేరుకోగా.. 2028 నాటికి దీనిని రూ.100 కోట్లకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వ్యాపార విస్తరణపై సాయితేజకున్న అభిరుచిని, ఆలోచనను ఇది తెలియజేస్తోంది. విజయానికి వయసు, అనుభవంతో పనిలేదని సాయితేజ ప్రయాణం గుర్తు చేస్తోంది. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానికి అనుగుణంగా ప్రణాళికను వేసుకుని కష్టపడి పనిచేస్తూ, ఆశయానికి కట్టుబడి ఉంటే విజయం దానంతట అదే వస్తుందనడానికి ఈ యువకుడే ఉదాహరణ.కాగా, సాయితేజ్ గోపిశెట్టిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ‘‘23 ఏళ్ల వయసులోనే ఇది అద్భుతం.. బీబీఏ గ్రాడ్యుయేట్ స్థాయి నుంచి కేవలం ఏడాదిన్నరలోనే రూ.20 కోట్ల అగ్రి కంపెనీని నిర్మించడం గొప్ప విషయం... స్పష్టమైన లక్ష్యం, ఆలోచనకు పనితీరు తోడైతే ఏం జరుగుతుందో ఇది నిరూపిస్తుంది.. 2028 నాటికి ల్యుమినరాన లెగసీ రూ.100 కోట్ల మార్కును చేరుకోవాలని కోరుకుంటున్నాను’’ అని నెటిజన్ ప్రశంసించాడు.‘ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం... అతడు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నా’ అని ఒకరు.. ‘విజయాన్ని వయసు నిర్ణయించదు.. కృషి, నిలకడ, అసలు సమస్యలను పరిష్కరించడమే విజయాన్ని అందిస్తాయి.. రూ.100 కోట్ల దిశగా సాగుతున్న ప్రయాణంలో సాయితేజకు... ల్యూమినారా లెగసీకి మరిన్ని విజయాలు లభించాలని కోరుతున్నా’ అని ఇంకొరు.. ‘‘తనను చూసి చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు ప్రోత్సాహం లేదా అగ్రశ్రేణి కళాశాలలో చదవడం వంటి అదృష్టం అందరికీ ఉండదు.. మనలో చాలా మంది సరైన అధ్యాపకులు, సౌకర్యాలు లేని గ్రామీణ కళాశాలల్లో చదువుకున్నాం.. అయినప్పటికీ మన కలల వెనుక పరుగెడుతూనే ఉన్నాం’’ మరొకరు కామెంట్లు పెట్టారు.