జట్టులోని ఆల్‌రౌండర్ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా లార్డ్స్ వేదికగా జరగబోయే ఆఖరి మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. 26 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ తన గాయం తీవ్రతను అంచనా వేయడానికి స్కాన్ పరీక్షలు చేయించుకోనున్నాడని, తదుపరి చికిత్స కోసం స్పెషలిస్ట్ వైద్యుల సలహాలను తీసుకోబోతున్నాడని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది.కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ కుడి కాలు హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. కేవలం ఐదు బంతులు మాత్రమే ఆడిన అతడు.. రెండు రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. గాయం కారణంగా వాషీ.. ఇన్నింగ్స్ సమయంలో కుడి కాలుకు పట్టీలు (స్ట్రాపింగ్) కట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే మెట్లు ఎక్కడానికి కూడా అతడు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ గాయం తీవ్రత కారణంగానే ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఛేజింగ్ సమయంలో వాషింగ్టన్ సుందర్.. ఫీల్డింగ్ చేయడానికి కూడా మైదానంలోకి రాలేకపోయాడు.ఇక వాషింగ్టన్ సుందర్ ప్లేసులో.. విదర్భకు చెందిన ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ హర్ష్ దూబేను బోర్డు ఎంపిక చేసింది. హర్ష్ దూబే ఇటీవల ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ధర్మశాలలో జరిగిన తన తొలి వన్డే మ్యాచ్‌లోనే 47 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. సుందర్ స్థానంలో దూబే జట్టులోకి వచ్చినప్పటికీ, లార్డ్స్ వన్డే తుది జట్టులో అతడికి చోటు దక్కడం కష్టమే. కుల్‌దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లాండ్‌తో మూడో వన్డే కోసం భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.