మరో ఐదు రోజులు వర్షాలు.. ఆదివారం ఈ జిల్లాలలో వానలు..

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదివారం రోజున పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక సోమవారం రోజున విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే ఆస్కారం ఉందని వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని.. భారీ హోర్డింగుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున చిన్న బోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మోపిదేవి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం..మరోవైపు వర్షాలు కురవాలంటూ కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వరుణ మంత్ర జపం, వరుణ హోమం నిర్వహించారు. వైదిక పండితుల ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ వరుణ హోమంలో ఆలయ అధికారులు, వేద పండితులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని దేవుణ్ని ప్రార్థించారు.