ఆన్‌లైన్‌లో మనం డబ్బులు మోసపోయామంటే అవి హుండీలో వేసిన కానుక లెక్కే. ఇవ్వడమే కానీ మళ్లీ తిరిగి తీసుకోవడం కష్టమే. సైబర్ మోసాలకు మనం గురయ్యామంటే ఆ డబ్బుల మీద ఆశలు వదిలేసుకోవడమే. ఎందుకంటే ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకునే ప్రాసెస్ అంతా ఈజీ కాదు. చాలా మందయితే అసలు ఆశలే వదిలేసుకుంటారు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం పట్టువిడువని విక్రమార్కుడిలా పోయిన డబ్బును తీసుకొచ్చుకున్నాడు. ఇందులో అసలు క్రెడిట్ మొత్తం పోలీసులదే. గుంటూరు జిల్లాకు చెందిన ఓ యవకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు ఉన్నాయన్న సమాచారంతో తెలియని వ్యక్తులను కాంటాక్ట్ అయ్యారు. గేలానికి చేప పిల్ల చిక్కింది అనుకుని ఆ సైబర్ నేరగాళ్లు కూడా ఈ యువకుడిని చిన్నగా నమ్మించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లగా కొంత కొంత నగదు డిపాజిట్ చేయించుకుంటూ.. చివరికి రూ. 43 లక్షలు స్వాహా చేశారు. ఆఖరికి మోసపోయానని గుర్తించిన ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. READ ALSO పోలీసుల తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన జయసాయి అనే యవకుడు ఆన్‌లైన్‌లో ఉద్యోగాల ఖాళీల సమాచారం పరిశీలిస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు పరిచయమయ్యారు. వర్క్ ఫ్రం హోం ఉద్యోగం చేసుకోవచ్చని నమ్మించి మొదట్లో కొంత డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం మాత్రం రాకపోవడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని బాధిత యువకుడు జయసాయి కోరాడు. ఈసారి కొత్త పన్నాగం పన్నిన మోసగాళ్లు టాస్క్ ఫ్రాడ్ అనే యాప్‌లో చేరి అందులోని ప్రశ్నలకు సమాధానాలు చెబితే బాగా లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట్లో కొంత పెట్టుబడి పెట్టించి కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్పగానే ఎక్కువ డబ్బులు వచ్చినట్టు చూయించారు. అయితే, ఆ డబ్బులు తీసుకోవాలంటే చిన్న మెలిక పెట్టారు. ఇంకొంత పెట్టుబడి పెట్టాలంటూ దశలవారీగా రూ. 43 లక్షలు స్వాహా చేశారు. ఎంత డబ్బులు పెట్టినా అవి వెనక్కి రాకపోవడంతో చివరకు మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుంటూరు ఎస్పీ వకుల జిందాల్ ఆదేశాల మేరకు సీఐ శివప్రసాద్, సైబర్ క్రైమ్ సీఐ నిసార్ బాషా తన సిబ్బందితో దర్యాప్తు చేశారు. మొదట బాధితుడు ఏ అకౌంట్లకు అయితే డబ్బులు వేశాడో, వాటన్నింటినీ ఫ్రీజ్ చేయించారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో ఆ ఖాతాల్లో ఉన్న రూ. 10 లక్షల నగదును రికవరీ చేశారు. ఆ డబ్బును బాధిత యువకుడు జయసాయికి అందజేశారు.