పవిత్ర అయోధ్య రామ మందిరం కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. ఆలయంలో విరాళాల దుర్వినియోగం కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోన్న వేళ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తొలిసారి స్పందించింది. ఈ ఘటన హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. రామ మందిర ట్రస్ట్ వ్యవహారాలకు వీహెచ్‌పీని బాధ్యులను చేయడం సరికాదంటూ ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అలోక్ కుమార్ మాట్లాడుతూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వంతో ఈ వివాదాన్ని ముడిపెడితే ఒప్పుకోమన్నారు. అలాగని ఈ ఘటనను సమర్థించే ప్రయత్నం కూడా చేయబోమని స్పష్టం చేశారు. "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. మాకు కూడా ఎంతో బాధ కలిగింది. అయితే, జరిగిన దాన్ని సమర్థించే ప్రయత్నం చేయము, సాకులు చెప్పే ప్రశ్నే లేదు" అని అన్నారు. READ ALSO విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు చంపత్ రాయ్ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటంతో ఆ అంశం కూడా ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. చంపత్‌ రాయ్‌కి ట్రస్ట్‌లో బాధ్యతలు ఇవ్వడంలో వీహెచ్‌పీ‌కి ఎలాంటి పాత్ర లేదంటూ అలోక్ కమార్ స్పష్టం చేశారు. "చంపత్ రాయ్ గారు వీహెచ్‌పీలో సీనియర్ నాయకుడు, ప్రస్తుతం అంతర్జాతీయ ఉపాధ్యక్షుడే. కానీ ట్రస్ట్‌లో ఆయనను మేము నియమించలేదు. మేము సిఫార్సు కూడా చేయలేదు. అక్కడ వీహెచ్‌పీకి ప్రాతినిధ్యం వహించడం లేదు" అని చెప్పారు.చంపత్ రాయ్‌పై ఇప్పటి వరకు వీహెచ్‌పీ కానీ, పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అలోక్ కుమార్ స్పష్టత ఇచ్చారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, ఈ విరాళాల పక్కదారి వ్యవహారంలో ఇప్పటి వరకు చంపత్ రాయ్ దోపిడీకి పాల్పడ్డారని, కుట్ర చేశారని ఎవ్వరూ నిర్వహించలేదని.. అయితే, ఈ కేసులో దోషులు ఎవ్వరైనా సరే కఠిన చర్యలు మాత్రం తప్పవని చెప్పారు. హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీసిన ఈ వ్యవహారంలో నిందితులకు కఠిన శిక్షలు పడాలంటూ అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీనియర్ అధికారులతో దర్యాప్తు చేయించాలని కోరారు. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో రోజువారీ విచారణ చేసి, నాలుగైదు నెలల్లోనే దోషులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. దోషులు జైలుకు వెళ్లడం హిందూ సమాజం చూడాలని, అప్పుడు మాత్రమే న్యాయం జరిగినట్టని చెప్పారు. రామ మందిరం బాధ్యత మాత్రం ట్రస్ట్‌దే అని, దాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చారు.