ఆహారకల్తీ నియంత్రణకు కొత్త శాఖ.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే జైలుకే..!

Wait 5 sec.

తెలంగాణలో ఆహారకల్తీ అతి పెద్ద సమస్యగా మారింది. వంటింటి సామాన్ల నుంచి పిల్లలు తినే చాక్లెట్లు, బిస్కెట్ల వరకు చెలగాటమాడుతున్నారు. ఈ నేపథ్యంలో కల్తీని పూర్తిగా అణచివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మక కార్యాచరణను ప్రారంభించింది. కొత్తగా ప్రత్యేక శాఖ లేదా విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం విడివిడిగా కొనసాగుతున్న ఫుడ్‌ సేఫ్టీ, డ్రగ్‌ కంట్రోల్‌ విభాగాలను ఒకే గొడుకు కిందకు తీసుకురానున్నారు. ఈ రెండు కీలక విభాగాలనూ విలీనం చేస్తూ ఏర్పడే ఈ కొత్త సూపర్ విభాగానికి ఒకే ఒక సమర్థుడైన విభాగాధిపతి నేతృత్వం వహించేలా తగిన అధికారిక చర్యలు తీసుకుంటున్నారు. ఆహార, ఔషధ రంగానికి చెందిన నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపేలా.. ఈ సరికొత్త శాఖ పరిధిలోనే ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, లీగల్ సెల్, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ల్యాబ్స్, పటిష్టమైన ప్రాసిక్యూషన్‌ విభాగాలను కూడా అంతర్భాగంగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.మరోవైపు.. రాష్ట్రంలో యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న మాదకద్రవ్యాల కేసులను, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు కూడా ఈ శాఖ అత్యంత చురుగ్గా పనిచేస్తుందని ఉన్నతాధికారుల బృందం భావిస్తోంది. ఈ కొత్త రక్షణ విభాగానికి అత్యంత నైపుణ్యం కలిగిన బలగాల దళాన్ని కేటాయించనున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే ఎలైట్ యాంటీ-నక్సల్ ఫోర్స్ అయిన గ్రేహౌండ్స్, ఉగ్రవాద నిరోధక విభాగం ఆక్టోపస్‌ల నుంచి వెనక్కి పిలిపించిన అనుభవజ్ఞులైన పోలీసు సిబ్బందిని, కమాండోలను కొత్తగా ఏర్పాటు చేయబోయే ఈ ప్రతిష్టాత్మక ప్రత్యేక శాఖలోకి బదిలీ చేసేందుకు పరిపాలనాపరంగా రంగం సిద్ధం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, తయారీ కేంద్రాలలో నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడంతో పాటు, నకిలీ మందుల ముఠాల గుట్టు రట్టు చేయడానికి ఈ కమాండో తరహా నిఘా విభాగం పగడ్బందీగా పనిచేయనుంది. అంతర్గత కసరత్తులన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నందున త్వరలోనే ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఈ సరికొత్త ఆహార, ఔషధ నియంత్రణ ప్రత్యేక శాఖ అధికారికంగా అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు.