ఆట మీరు మొదలు పెట్టారు… ప్రజలు దాన్ని ముగిస్తారు -పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్‌రాజ్ ఆగ్రహం

Wait 5 sec.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' (బచ్చలకూర జోసెఫ్)ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై విలక్షణ నటుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైఖరిని తప్పుబడుతూ తాజాగా ఆయన మరో వీడియో విడుదల చేశారు.ప్రశ్న రావణ్‌కు 14 రోజుల రిమాండ్గన్నవరం పోలీస్ స్టేషన్‌లో జనసేన పార్టీ నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు 'ప్రశ్న రావణ్'పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజద్రోహంతో పాటు పలు ఇతర తీవ్రమైన సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. అనంతరం నిందితుడిని గన్నవరం న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా కోర్టు జులై 18 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆయన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.ప్రకాష్ రాజ్ తీవ్ర ఆగ్రహంఈ రిమాండ్ విధింపు, పోలీసుల తీరుపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. న్యాయస్థానాలు ఒక కేసులో బెయిల్ మంజూరు చేస్తున్నప్పటికీ, ఏపీ పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒకదాని తర్వాత ఒకటిగా కొత్త కేసులు బనాయిస్తూ, ఒక వ్యక్తిని మానసికంగా, చట్టపరంగా వేధించడం ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ‘పోలీసులు తప్పుడు కేసులు పెట్టిన యూట్యూబర్‌కి కోర్టు నాలుగు సార్లు బెయిల్ ఇస్తే దేశ ద్రోహం కింద మళ్లీ అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం కేసా.. ఇది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతుల్ని నొక్కడానికి చేస్తోన్న కుట్ర అని అందరికీ అర్థమైంది. నెక్ట్స్ ఏంటి క్యారెక్టర్ అసాసినేషనా. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలతో స్టార్ట్ చేశారు. రావణ్ ఫోన్ పోలీసుల దగ్గరే ఉంది. దానిలోని పర్సనల్ డేటాని లీక్ చేసి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆయనకు అండగా నిలిచిన వాళ్లని కూడా వేధిస్తారు కదా. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో మీ ఆట మొదలైంది. ముగింపు మాత్రం ప్రజలే ఇస్తారు. గేమ్ ఆన్’ అంటూ ప్రకాష్ వీడియోలో పేర్కొన్నారు. యూట్యూబర్ కావడం, దానికి మద్దతుగా ప్రకాష్ రాజ్ రంగంలోకి దిగడంతో నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయి పెద్ద యుద్ధమే చేస్తున్నారు.. భావప్రకటన స్వేచ్ఛను అణచివేస్తున్నారంటూ ఒకవర్గం విమర్శిస్తుండగా.. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని, అందుకే చట్టం తన పని తాను చేసుకుపోతోందని జనసేన, కూటమి మద్దతుదారులు కౌంటర్లు ఇస్తున్నారు. మొత్తానికి 'ప్రశ్న రావణ్' జైలు శిక్ష వ్యవహారం కంటే కూడా, దానిపై ప్రకాష్ రాజ్ స్పందించిన తీరే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.