హైదరాబాద్‌లో ప్రజా దర్భార్, జాబ్ మేళా నిర్వహించిన ఏపీ మంత్రి.. మంచి అవకాశం

Wait 5 sec.

ఏపీ మంత్రి హైదరాబాద్‌లో జాబ్ మేళా, ప్రజా దర్భార్ నిర్వహించారు. అదేంటి ఏపీ మంత్రి తెలంగాణకు ఎందుకు వెళ్లారు.. అక్కడ జాబ్ మేళా, ప్రజా ధర్భార్ ఎవరి కోసం ఏర్పాటు చేశారనే అనుమానం ఉంది కదా. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి కోసమే మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌ కొండాపూర్‌లోని బిక్షపతి యాదవ్‌ కల్యాణ మండపంలో ఏపీ ప్రజల కోసం జాబ్‌మేళాతోపాటు ప్రత్యేక ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. మంత్రి సుభాష్ అక్కడి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల్ని తెలుసుకున్నారు.. కచ్చితంగా పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని.. వారికి కూడా అండగా ఉంటుందన్నారు మంత్రి సుభాష్‌. ఏపీకి నిరుద్యోగులకు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని.. హైదరాబాద్‌లో నిర్వహించిన జాబ్‌మేళా, ప్రజాదర్బార్‌కు మంచి స్పందన వచ్చిందన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువయ్యేలా కృషి చేస్తామన్నారు. ఆంధ్ర ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా తమకు తెలియజేస్తే తక్షణమే స్పందించి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉంటామన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్.ఏపీ నుంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చిన యువతకు భరోసా కల్పించాలనే జాబ్ మేళా నిర్వహించామన్నారు మంత్రి సుభాష్. ఉద్యోగ అవకాశాలు లేక నిరాశలో ఉన్న యువతకు ఆశాకిరణంగా, ఇతర రాష్ట్రంలో తొలిసారిగా ఈ జాబ్ మేళా నిర్వహించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. మంత్రి నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలు ఎక్కడ ఉంటున్నా.. వారి సంక్షేమం కోసం అండగా ఉండాలనే ఈ ఆలోచన చేశారన్నారు. అందుకే ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలు, ఒకవేళ అవసరమైతే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందన్నారు మంత్రి సుభాష్.