ప్రియురాలు పిలిచిందని సరిహద్దు దాటి పాక్ నుంచి వచ్చిన యువకుడు.. భారత్ తీసుకున్న నిర్ణయం ఇదే!

Wait 5 sec.

ప్రేమ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు ఆ యువకుడు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి ఎల్ఓసీ దాటి మరీ 22 ఏళ్ల యువకుడు భారత్‌లోకి వచ్చాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న భారత అధికారులు, పలు కోణాల్లో దర్యాప్తు చేసి చివరికి ప్రేమ కోసమే వచ్చినట్టు నిర్థారించారు. వివరాల్లోకి వెళ్తే.. జీషాన్ మీర్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన లాల్ మీర్ కుమారుడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ స్నాప్‌చాట్ ద్వారా బారాముల్లా జిల్లాలోని తుల్వారీ గ్రామానికి చెందిన ఇరమ్ బానో అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. మాట్లాడుకుంటూ ఉండగా జీషాన్ పూర్వీకులు కూడా ఇరమ్ బానో నివసిస్తున్న తుల్వారీ గ్రామానికే చెందినవారని ఇద్దరికీ తెలిసింది.తన కుటుంబ సమస్యలను జీషాన్ చెప్పడంతో, భారత్‌కు వచ్చి తన పూర్వీకుల ఆస్తిని చట్టబద్ధంగా పొందేందుకు ప్రయత్నించాలని ఇరమ్ బానో సూచించింది. అయితే, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత భారత సైన్యం ఎదుట లొంగిపోవడం, చట్టం ప్రకారం విధించే శిక్షను అనుభవించడం, అనంతరం విడుదలైన తర్వాత పూర్వీకుల ఆస్తిపై చట్టబద్ధంగా హక్కు సాధించి భారతదేశంలోనే స్థిరపడడం అనే ప్రణాళికను ఇద్దరూ ముందుగానే సిద్ధం చేసుకున్నారు. READ ALSO గత మే 31న బారాముల్లా జిల్లా ఉరీ సెక్టార్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భారత సైన్యం జీషాన్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణ సందర్భంగా జీషాన్ చెప్పిన వివరాలను ధ్రువీకరించేందుకు ఇరమ్ బానోను కూడా అధికారులు పిలిపించి ప్రశ్నించారు. జీషాన్‌ను భారత్‌లోనే ఉండేందుకు అనుమతించాలని ఆమె అధికారులను కోరినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఉగ్రవాద సంబంధాలు లేదా ఇతర కుట్రలేమైనా ఉన్నాయా అనే కోణంలో భద్రతా సంస్థలు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించాయి. ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత చట్టపరమైన ప్రక్రియ ప్రకారం జీషాన్‌ను తిరిగి పాకిస్థాన్‌కు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 12:24 గంటలకు కమాన్ అమన్ సేతు వద్ద జీషాన్ మీర్‌ను భారత సైన్యం అధికారికంగా పాకిస్థాన్ సైన్యానికి అప్పగించింది.