హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు క్షేత్రస్థాయిలో ఊపందుకున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి నగర శివార్లకు చేరుకోవడం సులువవుతున్నప్పటికీ అక్కడి నుంచి సికింద్రాబాద్ లేదా నగర ప్రధాన ప్రాంతాలకు రావాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కేవలం ఐదారు కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి పీక్ అవర్స్‌లో గంట నుంచి గంటన్నరకు పైగా సమయం పడుతోంది. ముఖ్యంగా శామీర్‌పేట, తూంకుంట, హకీంపేట మీదుగా సికింద్రాబాద్ వైపు వచ్చే ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ సుదీర్ఘ సమస్యకు చెక్ పెట్టేందుకు రెండు కారిడార్లు నగర రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవాన్ని తీసుకురానున్నాయి. ఇటీవల పనులు ప్రారంభం కావడంతో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ ఆదేశాల మేరకు శనివారం అధికారుల బృందం మీడియా ప్రతినిధులతో కలిసి నిర్మాణ స్థలాలను సందర్శించింది. కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణ సమయం 45-60 నిమిషాల నుంచి ఏకంగా 10-15 నిమిషాలకు తగ్గిపోనుంది.మొదటి విడతగా అత్యంత రద్దీ ప్రాంతమైన , రాజీవ్‌గాంధీ విగ్రహం, బోయినపల్లి చెక్‌పోస్టు మీదుగా డెయిరీఫాం వరకు 5.3 కిలోమీటర్ల మేర కారిడార్‌ను రూ. 1,487 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో 4.6 కిలోమీటర్ల పొడవు ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్ రూపంలో ఉండగా.. మిగిలిన 600 మీటర్ల భాగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా బేగంపేట ఎయిర్‌పోర్టు రన్‌వే కింద నుంచి నిర్మించనున్నారు. విమానాల రాకపోకలకు ఎలాంటి సాంకేతిక లేదా రక్షణ పరమైన ఆటంకాలు కలగకుండా ఈ 600 మీటర్ల మేర భూగర్భ సొరంగ మార్గాన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో పిల్లర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 20 పిల్లర్లు, 6 వయోడక్ట్‌ల పనులు ప్రారంభమయ్యాయి. ఎయిర్‌పోర్టు అండర్ టన్నెల్ పనులకు సంబంధించి బాలంరాయ్‌ వద్ద అవసరమైన భారీ యంత్రాలతో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ పనులన్నింటినీ రాబోయే రెండేళ్ల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.మరోవైపు, ప్యారడైజ్‌ జంక్షన్ నుంచి తిరుమలగిరి, అల్వాల్, హకీంపేట మీదుగా నేరుగా శామీర్‌పేట వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌ రోడ్డును అనుసంధానిస్తూ నిర్మించే 18.14 కిలోమీటర్ల రెండో భారీ కూడా త్వరలోనే పూర్తిగా ఊపందుకోనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 4,263 కోట్లను వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా టివోలీ జంక్షన్, జనరల్ చౌదరి రోడ్డు, సికింద్రాబాద్ క్లబ్ జంక్షన్ మీదుగా విక్రంపురి వరకు 1.3 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ అండర్‌పాస్ నిర్మించనున్నారు. స్థానిక వ్యాపారాలు, అంతర్గత రహదారుల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ అండర్‌పాస్‌కు ఇరువైపులా రెండు లేన్ల సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ అండర్‌పాస్ ముగిసిన వెంటనే మళ్లీ భారీ ఫ్లైఓవర్ ప్రారంభమవుతుంది. అలాగే హకీంపేట ఎయిర్‌పోర్టు వైమానిక నిబంధనల దృష్ట్యా అక్కడ 400 మీటర్ల మేర అండర్‌ టన్నెల్, తూంకుంట పరిధిలో స్థానిక వాహనాల రాకపోకల కోసం ప్రత్యేకంగా వెహిక్యులర్ అండర్‌పాస్‌ను నిర్మిస్తున్నారు. ఈ రెండు భారీ కారిడార్లు పూర్తయితే సికింద్రాబాద్, కంటోన్మెంట్‌తో పాటు శామీర్‌పేట పరిసర ప్రాంతాల రియల్ ఎస్టేట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని, ఇవి నగర అభివృద్ధిలో గేమ్ ఛేంజర్స్‌గా నిలుస్తాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.