ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలతో ఆ దేశం శోఖసంద్రంలో మునిగిపోయింది. అమెరికా - ఇరాన్ యుద్ధం మొదలైన సమయంలోనే ఖమేనీని అమెరికా బలగాలు హతమార్చాయి. అయితే, ఈ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనేతలంతా ఒకే చోట చేరారని, తలచుకుంటే ఒక్క దాడితో వారందరినీ హతమార్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం దౌత్య చర్చలు కొనసాగుతున్నందున అలాంటి చర్య తీసుకోవడం లేదని చెప్పడం చర్చనీయాంశమైంది. అమెరికా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ "అందరూ ఒకే చోట ఉన్నారు. ఒక్క దాడి చేస్తే అందర్నీ అంతం చేయొచ్చు. కానీ అలా చేయం. ఎందుకంటే అలా చేస్తే చర్చలు జరిపేందుకు ఎవరూ మిగలరు" అని వ్యాఖ్యానించారు. ఖమేనీ అంత్యక్రియల్లో వేలాది మంది ప్రజలు పాల్గొని నివాళులర్పించడంపై కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.ఖమేనీని ఇరాన్ ప్రజల్లో చాలామంది వ్యతిరేకిస్తారని తాను భావించానని, అయితే భారీ సంఖ్యలో ప్రజలు దుఃఖించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు."అవి నిజమైన కన్నీళ్లు కాకపోవచ్చు.. నకిలీ కన్నీళ్లు కూడా కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఆక్సియోస్ పేర్కొంది. ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని కూడా ట్రంప్ అన్నారు. వాళ్లు ఒప్పందం కోసం వేడుకుంటున్నారు అని పేర్కొన్న ఆయన, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఇరు దేశాలు వారం రోజుల పాటు చర్చలు, సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేయాలని అంగీకరించాయని తెలిపారు. READ ALSO అయితే, ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. "మీకు నాగరికత లేదు.. చరిత్ర లేదు.. గౌరవం లేదు. అందుకే ఇలాంటి విషయాలు మీకు అర్థం కావు" అంటూ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేసింది. టెహ్రాన్‌లో నిర్వహించిన ఖమేనీ అంత్యక్రియలకు వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. ఇరాన్ జెండాలు ఊపుతూ, ఖమేనీ చిత్రపటాలతో ప్రజలు నివాళులర్పించారు. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన కుమారుడు మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. ఇటీవల జరిగిన దాడిలో ఆయన కూడా గాయపడినట్లు సమాచారం ఉన్నప్పటికీ, దీనిపై ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.