ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు టెహ్రాన్ నగరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. లక్షలాది మంది ప్రజలు ఈ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ అంత్యక్రియల్లో ఖమేనీ ముగ్గురు కుమారులు పాల్గొనగా, ఆయన వారసుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ మాత్రం ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసిన విజువల్స్‌లో ఖమేనీ కుమారులు మోస్తఫా ఖమేనీ, మేయ్‌సమ్ ఖమేనీ, మసూద్ ఖమేనీ తమ తండ్రి శవపేటిక దగ్గరే ఉండి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా నిర్వహించారు. టెహ్రాన్‌లోని ఇమామ్ ఖమేనీ గ్రాండ్ మోసల్లా ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్షలాది మంది ఇరానీయులు కన్నీటి వీడ్కోలు తెలిపారు. అంత్యక్రియలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చీఫ్ అహ్మద్ వహీది సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా ఖమేనీ కుమారుడు మసూద్ ఖమేనీ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. ఇరాన్ విప్లవానికి, పాలస్తీనా సంఘీభావానికి ప్రతీకగా భావించే కెఫియెహ్ స్కార్ఫ్‌తో ఆయన కన్నీళ్లు తుడుచుకోవడం వీడియోల్లో కనిపించింది. ఇరాన్ జాతీయ జెండాతో కప్పిన ఖమేనీ శవపేటికపై నల్ల తలపాగా ఉంచారు. ఆయనతో పాటు ఇటీవల జరిగిన దాడుల్లో మరణించిన కుటుంబ సభ్యుల నలుగురి శవపేటికలను కూడా పక్కనే ఉంచారు. వారిలో 14 నెలల చిన్న మనవరాలు కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. ఖమేనీ మరణానంతరం సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు ప్రజల ముందుకు రాలేదు. అంత్యక్రియల్లో ఆయన కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, భద్రతపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, మొజ్తబా ఖమేనీ అంత్యక్రియల చివరి కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ఇద్దరు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 56 ఏళ్ల మొజ్తబా తన తండ్రి అంత్యక్రియల్లో కనీసం కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకున్నట్లు తెలుస్తోంది.