చుట్టూ రాజకీయ వేడి మరోసారి రాజుకుంది. ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణ నాణ్యతపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన సాంకేతిక లోపాల కారణంగానే ప్రస్తుతం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పూర్తిస్థాయిలో వినియోగించలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రిపోర్టు ప్రకారం 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. బ్యారేజీల పునాదుల్లో లోపాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారని పేర్కొన్న మంత్రి ఉత్తమ్.. ఇలాంటి పరిస్థితుల్లో నీటిని నిల్వ చేస్తే మేడిగడ్డకు నష్టం వాటిల్లడంతో పాటు భద్రాచలం, పరిసర గ్రామాల్లో ముంపు ముప్పు తలెత్తే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించాలని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న డిమాండ్ టెక్నికల్‌గా సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు. ప్రాణహిత నుంచి ఎత్తిపోసే నీరు అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీలకు చేరాల్సి ఉంటుందని.. అయితే ఈ 2 బ్యారేజీలు దెబ్బతిన్న నేపథ్యంలో నీటి నిల్వ, పంపింగ్ వ్యవస్థ కొనసాగడం అసాధ్యమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ.. వాటి రూపకల్పనలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి భారంగా మారాయని మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రైతుల అవసరాల కంటే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చడం, కాళేశ్వరాన్ని ప్రస్తుత రూపంలో నిర్మించడం వల్లే వ్యయం పెరిగిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.కాగ్ నివేదికలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై పలు అభ్యంతరాలు నమోదయ్యాయని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే భారీ స్థాయిలో విద్యుత్ అవసరమవుతుందని.. నిర్మాణం పూర్తైన తొలి దశ నుంచే లీకేజీలు, సాంకేతిక సమస్యలు బయటపడినా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని ఆరోపించారు. క్షేత్రస్థాయి ఇంజినీర్లు పలుమార్లు హెచ్చరించినా వాటిని విస్మరించి నీటి నిల్వ కొనసాగించడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.కాళేశ్వరం ప్రాజెక్టు సురక్షితంగా ఉంటే దాన్ని వినియోగించడానికి తమ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే నిపుణుల హెచ్చరికలను విస్మరించి ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకునే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. కాళేశ్వరం అంశంపై వాస్తవాలను పక్కనబెట్టి రాజకీయ విమర్శలు చేయడం కంటే సాంకేతిక నివేదికలను గౌరవించాలని ప్రతిపక్షాలకు సూచించారు.