ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో, ఇతర ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుని, మిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం దక్కించుకోడానికి అమెరికా గూఢచారి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఏజెంట్‌ అవతారం ఎత్తిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) నివేదిక ప్రకారం.. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త గౌరవ శ్రీవాస్తవ తనను తాను సీఐఏ ఏజెంట్‌గా పరిచయం చేసుకున్నాడు. సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. అంతేకాదు, తనకు తాను ‘మిస్టర్ G’ అనే నిక్‌నేమ్ కూడా పెట్టుకున్నాడు.2020లో వాషింగ్టన్, డీసీ, జకార్తాలలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలకు ప్రబోవోతో పాటు అతడు వెళ్లినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమావేశాలలో యుద్ధ విమానాలు, ఇతర రక్షణ పరికరాలతో సహా సైనిక కొనుగోళ్లపై చర్చ జరిగింది. అతడి మాజీ వ్యాపార భాగస్వామి నీల్స్ ట్రూస్ట్ కాలిఫోర్నియా, న్యూయార్క్‌ కోర్టులలో దాఖలు చేసిన సివిల్ వ్యాజ్యాల ఆధారంగా ఈ నివేదిక వెలువడింది. ట్రూస్ట్ తన కంపెనీలో శ్రీవాస్తవకు 50 శాతం యాజమాన్య వాటాను ఇచ్చాడని ఆరోపణలున్నాయి.ట్రూస్ట్ ప్రకారం.. సుబియాంతో సోదరుడు, అర్సారీ గ్రూప్ ఛైర్మన్ హషీమ్ జొజోహాడికుసుమోతో సహా శక్తివంతమైన ఇండోనేషియా వ్యాపారవేత్తలతో కూడా శ్రీవాస్తవ సంబంధాలు ఏర్పరచుకున్నాడు. రికార్డ్ చేసిన ఫోన్ కాల్స్‌లో తాను సీఐఏ కోసం పనిచేశానని శ్రీవాస్తవ చెప్పుకొన్నట్టు ఈ వ్యాజ్యంలో పేర్కొన్నాడు. ఇండోనేషియా ఉన్నతాధికారుల నమ్మకాన్ని పొందడానికి, ప్రభుత్వ ఉన్నతస్థాయి సమావేశాల్లో ప్రవేశానికి సీఐఏ ఏజెంట్‌ అని అబద్దాన్ని ఉపయోగించుకున్నాడని వ్యాజ్యాలు ఆరోపిస్తున్నాయి.2002లో ఇండోనేషియాలో 200 మందికి పైగా ప్రాణాలు తీసిన బాలి బాంబు దాడులకు బాధ్యులైన వారిని గుర్తించడంలో తాను సహాయం చేశానని అతడు చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. సుబియాంతోను అమెరికా ఇమ్మిగ్రేషన్ బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించడంలో తాను కీలక పాత్ర పోషించానని కూడా అతను చెప్పుకున్నట్టు తెలుస్తోంది. 2020లో యుద్ధ విమానాలు, ఇతర సైనిక పరికరాల కొనుగోలు కోసం ఇండోనేషియా నుంచి మూడు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI)లను శ్రీవాస్తవ పొందగలిగారు. అలాగే, 2021- 2022లో మరో రెండు రక్షణ ప్రాజెక్టుల కోసం అతడు ఇంకొక లెటర్ ఆఫ్ ఇంటెంట్, అవగాహన ఒప్పందం (MoU)ను కుదుర్చుకున్నారని నివేదిక పేర్కొంది.2020 నుంచి 2022 మధ్య, శ్రీవాస్తవతో సంబంధం ఉన్న నాలుగు కంపెనీలు ఇండోనేషియా రక్షణ విభాగం, ఒక ప్రభుత్వ రంగ రక్షణ సంస్థతో ఐదు ప్రాథమిక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రతిపాదిత ఒప్పందాలలో 36 F-15 యుద్ధ విమానాలు, యుహెచ్-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు, సి-130 రవాణా విమానాలు, ఇండోనేషియాకు సైనిక కమాండ్, నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి.2022లో 13.9 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఇండోనేషియాకు 36 ఎఫ్-15 యుద్ధ విమానాలు, సంబంధిత పరికరాల అమ్మకానికి అమెరికా ఆమోదం తెలిపింది. అయితే, శ్రీవాస్తవతో సంబంధం ఉన్న నాలుగు బోగస్ కంపెనీలని, వీటికి రక్షణ రంగ కొనుగోళ్లలో ఎటువంటి అనుభవం లేదని నివేదిక పేర్కొంది.అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కో-ఆపరేషన్ ఏజెన్సీ ఇండోనేషియాకు ఎఫ్-15 యుద్ధ విమానాల ప్రతిపాదిత విక్రయాన్ని అధికారికంగా ప్రకటించినప్పుడు శ్రీవాస్తవ కంపెనీలలో ఒక్కదాని పేరు కూడా అందులో లేకపోవడం గమనార్హం.