జమ్మూకశ్మీర్‌లో ఇప్పుడు కొత్త వివాదం గందరగోళానికి గురి చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల లైబ్రరీలకు పంపిణీ చేసిన రెండు పుస్తకాల్లో వేర్పాటు వాదులు, ఉగ్రవాదులకు సంబంధించిన వ్యక్తులను గొప్ప నాయకులుగా పేర్కొన్నారనే ఆరోపణలతో భారీ వివాదం చెలరేగింది. ఈ వ్యవహారంలో పాఠశాల విద్యాశాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. పర్సనాలిటీ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్, గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్ అనే రెండు పుస్తకాలను ఇటీవల ప్రభుత్వం బయటకు తీసుకొచ్చింది. ఈ రెండు పుస్తకాలే ఇప్పుడు తీవ్ర వివాదానాకి కారణమయ్యాయి. దాంతో ప్రభుత్వం ఈ రెండు పుస్తకాలను రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ దీనిపై వెంటనే చర్యలు కూడా చేపట్టింది. పర్సనాలిటీ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూకశ్మీర్ పుస్తకాన్ని హిలాల్ అహ్మద్, సంతోష్ మీనా రచించగా.. ఒబెరాయ్ బుక్ సర్మీస్ ప్రచురించింది. గ్రేట్ పర్సనాలిటీస్ ఆఫ్ జమ్మూకశ్మీర్ పుస్తకాన్ని సుశాంత్ గిరి రచించగా, ఢిల్లీలోని అనురాగ్ ప్రకాశ్ సంస్థ ప్రచురించింది. READ ALSO అసలు ఈ పుస్తకాల్లో తీవ్ర వివాదం చెలరేగడానికి కారణమైన అంశం ఏంటంటే.. ఇందులో వేర్పాటువాద నాయకులు, ఉగ్రవాదానికి సంబంధించిన వ్యక్తులైన మక్బూల్ భట్, సయ్యద్ అలీ షా గిలానీ, మసరత్ ఆలమ్, హురియత్ నేత మీర్వైజ్ ఉమర్ ఫరూఖ్‌లను గొప్ప వ్యక్తులుగా, ఆదర్శ నాయకులుగా చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్పందించిన జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ దీనిని అకడమిక్ జిహాద్‌గా పేర్కొన్నారు. ఇలాంటి పుస్తకాల ద్వారా చిన్నారుల మనస్సులు కలుషితం అవుతుంది అంటూ ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఉన్నతాధికారిని నియమించారు. సమగ్ర విచారణ నిర్వహించేందుకు ఫైనాన్షియల్ కమిషనర్ అశ్వనీ కుమార్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఆయన తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.