క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే టెండర్లు ఖరారు, మంత్రి పొంగులేటి కీలక అప్డేట్

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలు, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా క్యూర్‌ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల కోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియను ఖరారు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో శనివారం క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, అలాగే రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై సంబంధిత ఉన్నతాధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం దేశానికే ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు.అదే స్ఫూర్తిని, నిబద్ధతను క్యూర్‌ పరిధిలో అట్టడుగు, తక్కువ ఆదాయ వర్గాల కోసం చేపట్టబోయే గృహ నిర్మాణ పథకంపైనా అధికారులు చూపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 26 నియోజకవర్గాల పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో తొలి విడతలో 500 ఇళ్ల చొప్పున నిర్మించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకంలో నియోజకవర్గాన్నే ఒక యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని, లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు వీలైనంత సమీపంలోనే ఇళ్లను నిర్మించాలని స్పష్టం చేశారు. దీనికోసం పరస్పర సమన్వయంతో ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన తదుపరి కార్యాచరణను వెంటనే సిద్ధం చేయాలని ఇంకా స్థలాలు గుర్తించని చోట్ల తక్షణమే భూసేకరణ లేదా ప్రభుత్వ స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.ఇదే సమావేశంలో రాష్ట్రంలోని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల మౌలిక వసతుల పెంపుదలపై మంత్రి కీలక నిర్ణయాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సొంత భవనాలు లేని 10 ఆర్డీవో కార్యాలయాలు, 107 తహసీల్దార్ కార్యాలయాలు, రెండు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీఐజీ కార్యాలయాలు, నాలుగు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలు, అలాగే 52 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు నూతనంగా శాశ్వత భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవలందించే ఈ ప్రభుత్వ భవనాలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన ఆకృతిలో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా, అత్యంత ఆధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఇక రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి పోర్టల్ అక్రమాలపై విచారణను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేగవంతం చేశారు. ధరణి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందంతో ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ధరణి పోర్టల్‌లో వివిధ రకాల మాడ్యూళ్లను అడ్డం పెట్టుకుని జరిగిన భూ అక్రమాలపై ఇప్పటివరకు సేకరించిన ఆధారాలు, విచారణ పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, సైబర్‌ క్రైం, ఐటీ కమ్యూనికేషన్లు, ఎన్‌ఐసీ నిపుణులు ఈ భేటీలో పాల్గొని విచారణ వివరాలను మంత్రికి వివరించారు. రైతుల వ్యవసాయ భూముల నిర్వహణ, భద్రతకు సంబంధించి త్వరలో తీసుకురాబోయే భూభారతి పోర్టల్‌లో అత్యంత పటిష్ఠమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి ఆదేశించారు.