హిందువుల 500 ఏళ్ల నాటి కల నెరవేరుతూ నిర్మాణం పూర్తి అయిన సంగతి తెలిసిందే. అయితే అయోధ్యకు వచ్చే విరాళాలు చోరీ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తడం.. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ ఆరోపణలు రావడంతో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి , ట్రస్టీ అనిల్ మిశ్రాలా రాజీనామాలు చేయడం పెను సంచలనంగా మారింది. ఇక ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసి.. అయోధ్య విరాళాల మాయం సంగతి చూస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజున అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా సమర్పించిన రాజీనామాలతోపాటు.. సిట్ విచారణ పురోగతి, భవిష్యత్ పరిపాలనా వ్యవస్థ వంటి కీలక అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ ఆశ్రమం అయిన మణిరామ్ ఛావ్నీలో ఈ భేటీ జరగనుంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నృత్య గోపాల్ దాస్.. వయోభారంతో ప్రయాణించలేని సీనియర్ ట్రస్టీ కె. పరాశరన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.అయోధ్య విరాళాల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను ట్రస్ట్ ఆమోదిస్తే.. కొత్త ప్రధాన కార్యదర్శి నియామకంతో పాటు ట్రస్ట్ పరిపాలనా వ్యవస్థలో మార్పులపై సభ్యులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రత్యేక ఆహ్వానితుడు గోపాల్ రావు పాత్రపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.మరోవైపు.. ఆలయ విరాళాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇచ్చిన మధ్యంతర రిపోర్టును కూడా ట్రస్ట్ పరిశీలించనుంది. ఇప్పటివరకు చంపత్ రాయ్, అనిల్ మిశ్రా, గోపాల్ రావు వాంగ్మూలాలను సిట్‌తో పాటు పోలీసులు నమోదు చేసినప్పటికీ.. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. ఒకవైపు పరిపాలనా విచారణ, మరోవైపు క్రిమినల్ దర్యాప్తు సమాంతరంగా కొనసాగుతున్నాయి.ఈ సమావేశంలోనే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ పూర్తి కాని ఆదాయ-వ్యయ ఖాతాలు, బ్యాలెన్స్ షీట్, ఇతర ఆర్థిక పత్రాలను కూడా ఆమోదించే అవకాశం ఉంది. అదే సమయంలో రామమందిర నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) నియామకంపై కూడా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది.ఇక.. రామమందిర విరాళాల వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను కూడా సమగ్రంగా విచారించాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అయోధ్య పోలీసులకు లేఖ రాసింది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా.. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు నేతలు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా దర్యాప్తులో భాగం చేయాలని కోరింది. సంబంధిత ఆధారాలు, పత్రాలు, సమాచారాన్ని సేకరించి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని వీహెచ్‌పీ విజ్ఞప్తి చేసింది.