ఐటీఐ చదువుతున్న 22 ఏళ్ల మోనూ అనే యువకుడు అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ఫరిదాబాద్‌లోని సెక్టార్ 8 పోలీసు స్టేషన్లో కంప్యూటర్ వర్క్ చేయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతడు తన చేతికి పని చెప్పాడు. పోలీసు స్టేషన్లోని స్టోరేజీ రూమ్‌లో దాచిన ఆయుధాలపై అతడి కన్నుపడింది. అక్కడి సిబ్బందితో నమ్మకంగా మెలిగిన మోనూ.. వీలు చిక్కినప్పుడల్లా ఒక్కో ఆయుధాన్ని మాయం చేయడం మొదలుపెట్టాడు.అలా 2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య ఏకంగా 32 ఆయుధాలను అక్కడి నుంచి మాయం చేశాడు. అలా మాయం చేసిన వాటిని తన కజిన్ విపుల్‌కు ఇచ్చేవాడు. అతడు వాటిని రాజస్థాన్‌కు చెందిన సంజయ్‌కు అప్పగించేవాడు. సంజయ్ తన నెట్‌వర్క్ ద్వారా వాటిని వేరే వాళ్లకు అమ్మేశాడు.ఈ ఏడాది మే నెలలో ఎస్‌హెచ్‌‌వో రాజ్‌బిర్ సింగ్ స్టోరేజీ రూమ్‌లో స్థానికులు దాచిపెట్టిన ఆయుధాల వివరాలు పరిశీలిస్తుండగా.. రిజిస్టర్‌లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో పూర్తిగా ఆడిట్ నిర్వహించగా.. 32 తుపాకీలు మిస్సయినట్లు గుర్తించారు. దొంగతనానికి గురైన వాటిలో విదేశాల్లో తయారైన పిస్టల్స్ కూడా ఉన్నాయి.దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. మోనూను విచారించగా.. ఆయుధాలను ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నాడు. దీంతో మోనూతోపాటు అతడి దగ్గర్నుంచి వాటిని తీసుకొన్న, కొనుగోలు చేసిన 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు.పోలీసులకు మోనూ పట్ల అనుమానం వచ్చి తమదైన స్టయిల్‌లో విచారించగా.. ఆయుధాలు మాయం చేయడం మాత్రమే కాకుండా.. గత ఏడాది జులైలో తన కజిన్‌ను కూడా అతడు ‘మాయం’ చేసినట్లు గుర్తించారు.మోనూకు సరిత అనే స్నేహితురాలు ఉంది. మోనూ కజిన్ అయిన శివమ్ తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అడ్వాంటేజీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని సరిత అతడికి చెప్పింది. దీంతో మోనూ ఓ ప్లాన్ వేశాడు. దాని ప్రకారం ఎవరూ లేని టైం చూసి.. మాట్లాడుకుందాం రమ్మని సరిత శివమ్‌ను ఇంటికి పిలిపించింది.శివమ్ ఇంటికి రాగానే అతడిని మాటల్లో పెట్టి.. నిద్ర మాత్రలు కలిపిన టీ ఇచ్చింది. టీ తాగిన కాసేపటికి శివమ్ మత్తులోకి జారుకున్నాడు. వెంటనే మోనూ, సరిత కలిసి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి అతణ్ని చంపేశారు. అర్ధరాత్రి సమయంలో బైక్ మీద ఇద్దరి మధ్య శవాన్ని పెట్టుకొని తీసుకెళ్లి.. కాలువలో పడేసి వచ్చారు.శివమ్ (19) కనిపించడం లేదని అతడి కుటుంబ సభ్యులు గత ఏడాది జులై 9న ఫరీదాబాద్‌లోని సెక్టార్ 56 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా సరే అతడి జాడ ఇప్పటి వరకూ దొరకలేదు. అతణ్ని తానే హత్య చేసి కాలువలో పడేశానని మోనూ చెప్పడంతో.. పోలీసులు డైవర్లను రంగంలోకి దించి కాలువలో వెతికిస్తున్నారు. ఇప్పటి వరకూ శివమ్ చెప్పులు మాత్రమే దొరికాయి.అసలు ట్విస్ట్ ఏంటంటే.. మోనూ పట్ల తమ కుటుంబానికి అనుమానం ఉందని శివమ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఇంతకు ముందే చెప్పారు. కానీ మోను పోలీసు స్టేషన్లోనే పని చేస్తుండటంతో.. పోలీసులు వాళ్ల ఆరోపణలు పట్టించుకోలేదని తెలుస్తోంది. సరితను కూడా అరెస్టు చేసిన పోలీసులు.. మోనూతోపాటు ఆమెపైనా హత్య కేసు నమోదు చేశారు. ఇక పోలీసు స్టేషన్ స్టోరేజీ రూమ్‌ నుంచి ఆయుధాలు పోయిన కేసులో.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఎస్సై బిజేందర్ సింగ్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై శాఖాపరమైన దర్యాప్తుకి ఆదేశించారు.