ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, నియామకాలపై నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై తేదీ ఖరారైంది. జులై 13 నుంచి ఉద్యోగాల సృష్టి, అప్‌గ్రేడేషన్‌పై నిషేధం అమలు చేయనుంది. బదిలీలు, డిప్యుటేషన్, ప్రమోషన్లతో పాటుగా కొత్త నియామకాలపై నిషేధం విధించింది. ఈ నిషేధం స్థానిక కేడర్ల కేటాయింపు పూర్తయ్యే వరకు కొనసాగనుంది. రాష్ట్రపతి ఉత్తర్వు-2025 అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఈ మేరకు మెమో జారీ చేసింది. కొన్ని శాఖలలో కేడర్ కేటాయింపులు పూర్తి కాకపోవడంతో గడువు పొడిగించారు.మరోవైపు ఉద్యోగ నియామకాలు, బదిలీలపై ఎప్పటి నుంచి నిషేధం అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తితో తేదీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు, హెచ్ఓడీలు ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించిన ప్రభుత్వం.. అన్ని శాఖలలోనూ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. మరోవైపు గవర్నమెంట్ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కేడర్ సంఖ్య నిర్ధరణ, అమలు గైడ్ లైన్స్ సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 ప్రకారం 26 జిల్లాలకు లోకల్‌ కేడర్‌ నిర్ధరణ ప్రక్రియ చేపడుతున్నారు. అయితే మార్కాపురం, పోలవరం జిల్లాలు ఈ పరిధిలోకి రావని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లాలకు కూడా తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తారు. లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్ నియామకం..మరోవైపు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లైజన్, స్పెషల్ రిప్రజెంటేటివ్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర అమెరికాలో పెట్టుబడుల కోసం సతీష్ మండువను ప్రిన్సిపల్ లైజన్‌గా నియమించారు. పశ్చిమాసియా, ఇతర దేశాలకు స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా రావి రాధాకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐరోపా ప్రత్యేక ప్రతినిధిగా జయకుమార్ గుంటుపల్లి, మిగిలిన దేశాలకు శ్రీనివాస్ పల్లపోతును ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఈ ప్రత్యేక ప్రతినిధులు ఏపీకి విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ సమన్వయం కోసం పనిచేస్తారు.