ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్‌‍ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ నాలుగు కేసులలో ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు ఇప్పటి వరకూ అరెస్ట్ చేయగా.. నాలుగు కేసులలోనూ కోర్టులు ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేశాయి. అయితే తాజాగా చేశారు. జనసేన నేత శివశంకర్ ఫిర్యాదు మేరకు చేసిన గన్నవరం పోలీసులు.. అతనిపై బీఎన్ఎస్ సెక్షన్లతోపాటుగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని (UAPA) సెక్షన్ 39 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) అంటే ఏమిటి.. దీనిని ఎలాంటి కేసులో, ఎవరి మీద ప్రయోగిస్తారనేదీ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే యూట్యూబర్ మీద ఈ చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం సాధ్యమా అనే వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఉపా చట్టం అంటే ఏమిటి?Unlawful Activities (Prevention) Actను సంక్షిప్తంగా UAPA అని పిలుస్తారు. తెలుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధఖ చట్టం - ఉపా చట్టం అని అంటారు. దేశ సార్వభౌమాధికారానికి, జాతీయ సమగ్రతకు భంగం కలిగించే చట్టవిరుద్ధమైన పనులు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. 1967లో ఈ చట్టం అమల్లోకి రాగా.. ఆ తర్వాత అనేక సవరణలు చేశారు. దేశాన్ని విభజించే కుట్రలకు మద్దతు ఇచ్చే చర్యలు, దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే పనులను అడ్డుకోవటమే ఉపా చట్టం ముఖ్య ఉద్దేశం. ఉగ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు, అలాంటి పనులకు నిధులు సమకూర్చేవారు, ఉగ్ర సంస్థలలో సభ్యులుగా ఉన్న వారిని కఠినంగా శిక్షించేందుకు ఉపా చట్టాన్ని అమలు చేస్తున్నారు. సాధారణ క్రిమినల్ చట్టాలకు ఉపా చట్టానికి ఉన్న తేడాలివే..సాధారణ క్రిమినల్ చట్టాలతో పోల్చి చూసినప్పుడు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రభుత్వాలకు, విచారణ సంస్థలకు కొన్ని అసాధారణమైన అధికారాలు కల్పిస్తోంది. 2019కి ముందు అయితే ఉపా చట్టం ప్రకారం సంస్థలను మాత్రమే నిషేధించేందుకు వీలు ఉండేది. అయితే 2019 సంవత్సరంలో ఉపా చట్టానికి చేసిన సవరణతో ఒక వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా ప్రకటించే అధికారం కేంద్రానికి ఉంది. సాధారణ క్రిమినల్ చట్టాల ప్రకారమైతే.. ఏదైనా క్రిమినల్ కేసులో నిందితుణ్ని అరెస్ట్ చేసిన తర్వాత.. 60 రోజుల నుంచి 90 రోజులు అంటే మూడు నెలలలోగా పోలీసులు అభియోగపత్రాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు ఆరు నెలల వరకూ సమయం ఉంటుంది. ఈ లెక్కన నేరారోపణలు చేయకుండానే ఆరు నెలలు జైళ్లో ఉంచే అధికారం పోలీసులకు ఉంటుంది. అలాగే ఉపా చట్టంలోని Section 43D (5) ప్రకారం బెయిల్ కూడా కష్టమే. పోలీసుల నివేదికను పరిశీలించిన అనంతరం, ఆరోపణలపై సరైన ఆధారాలు ఉన్నాయని.. ఆరోపణలు ప్రాథమికంగా నిజమేనని కోర్టులు నమ్మితే బెయిల్ దొరకటం కష్టమేనని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణ చట్టాల ప్రకారం కేసులలో నేరం రుజువయ్యేవరకూ నిందితుడు నిర్దోషిగా ఉంటాడు. కానీ ఉపా చట్టంలో మాత్రం బెయిల్ దశలో నిందితుడే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఉపా చట్టమనేది విదేశీయులకు సైతం వర్తిస్తుంది. దేశం వెలుపల ఉంటూ మన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసే కుట్రలు, నేరాలను అరికట్టేందుకు ఈ ఉపా చట్టం పనిచేస్తుంది. ఈ చట్టం కింద ఎవరినైనా దోషిగా తేల్చాలంటే.. ఆ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధం ఉండాలి, లేదా సాయుధ తిరుగుబాటుకు కుట్ర చేసి ఉండాలి. అలా కేకుండా కేవలం ప్రసంగాలు, వీడియోల ఆధారంగా ఉగ్రవాదుల ముద్ర వేయలేమని.. ఉపా చట్టాలు ప్రయోగించలేమని సుప్రీంకోర్టు ఇప్పటికే ఓసారి స్పష్టం చేసింది. తీవ్రంగా మాట్లాడినంత మాత్రన నేరం కాదని పేర్కొంది. ప్రసంగాలు, వీడియోల ద్వారా హింసను ప్రేరేపించేలా, సృష్టించేలా ఉంటేనే నేరంగా, దేశభద్రతకు ముప్పుగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.