బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి రోడ్డు ప్రమాదం.. ఛాతీ భాగంలో తీవ్ర గాయాలు, కిమ్స్ ఆస్పత్రికి తరలింపు

Wait 5 sec.

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల బృందం వెళ్తుండగా అపశృతి చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకోగా.. ఈ ఘటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు గాయాల పాలయ్యారు. ప్రమాదం తర్వాత ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.ఆదివారం ఉదయం కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని కన్నెపల్లి లక్ష్మి పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా వీరా హోటల్ సమీపంలో కాన్వాయ్‌లోని 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కారు తగలడంతో ఆయన కిందపడి గాయపడ్డారు.ప్రమాదంలో ఆయన ఛాతీ భాగంతో పాటు శరీరంలోని ఇతర భాగాలకు కూడా స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే శంభీపూర్ రాజుకు ఛాతీలో నొప్పి ఎక్కువగా ఉండటంతో మెడికల్ టెస్టుల కోసం వెంటనే కొంపల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఎమర్జెన్సీ విభాగంలో డాక్టర్లు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా లేదని.. అవసరమైన వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ప్రమాదం జరిగిన వెంటనే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని శంభీపూర్ రాజును పరామర్శించారు. ఆ తర్వాత డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించాలని ఆస్పత్రి సిబ్బందిని కోరినట్లు సమాచారం. మరోవైపు.. కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలోనే జనగామ జిల్లా పెంబర్తి వద్ద నేషనల్ హైవేపై బారికేడ్లు ఏర్పాటు చేసి కేటీఆర్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ వాదనను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు వెళ్తున్నామని గులాబీ నేతలు చెబుతుండగా.. శాంతిభద్రతల దృష్ట్యా ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.