ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఏపీ ప్రభుత్వ తీరుపై మాజీ ముఖ్యమంత్రి, అధినేత మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబు పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని జగన్ ఆరోపించారు. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ జగన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజకీయ అణచివేత చర్యల కోసం, ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పోలీస్‌ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో నాటిన విషపు విత్తనాలు మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయని జగన్ విమర్శించారు. చిన్నారులు మిస్సింగ్‌ అయినా దర్యాప్తుపై వేగం లేదని.. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదని మండిపడ్డారు. గిరిజన మహిళను వివస్త్ర చేసి, దాడి చేసినా అరెస్టులు లేవని.. సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెడతారా అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. " కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు. తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?" అని జగన్ విమర్శించారు.మరోవైపు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న జగన్.. ఈ ఘటనలో వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకున్నారని.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టారని మండిపడ్డారు. సాయికృష్ణ లాకప్‌డెత్‌, శవం మాయం కేసులో అతని తల్లి అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవన్న జగన్.. క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు, తన మరణ వాంగ్మూలం, గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌, కళావతి ఆత్మహత్య కేసులు పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయన్నారు.ఈ అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని జగన్ ఆరోపించారు. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, ఉస్మానియా గోల్డ్‌మెడల్‌ జర్నలిస్ట్‌ కేవీఆర్‌ను చట్టాలు పాటించకుండా హైదరాబాద్‌ నుంచి పోలీసు బలగాలతో తీసుకువచ్చారని, చేయనివాటిని కూడా చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జైలుకు పంపించారని జగన్ ఆరోపించారు. యూట్యూబర్‌ రావణ్‌కు నాలుగు కోర్టుల్లో బెయిల్స్‌ వస్తే.. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌ గతంలో ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో.. వీళ్లు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని, వాటినే ప్రశ్నిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. అలాంటప్పుడు అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా? అని నిలదీశారు. "విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్‌స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్‌ వ్యవస్థ కావాలి." అంటూ జగన్ ట్వీట్ చేశారు.