ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం సరికొత్త మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తొలిసారి అరెస్టయిన రావణ్‌ను పోలీసులు పిఠాపురం తరలించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనను పోలీసులు వరుసగా నాలుగు వేర్వేరు కేసుల్లో అరెస్ట్ చేయగా.. అన్నింటిలోనూ కోర్టుల నుంచి బెయిల్ లభించింది. తాజాగా శనివారం ఎలమంచిలి కోర్టులో రావణ్‌కు బెయిల్ మంజూరై.. ఆయన జైలు నుంచి విడుదలైన కొద్దిసేపటికే నక్కపల్లి టోల్ ప్లాజా వద్ద ఏలూరు పోలీసులు ఆయనను ఐదోసారి అత్యంత నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు పరిధిలో నమోదైన మరో పాత కేసు ఆధారంగానే ఈ తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఐదో అరెస్టుకు కొద్ది నిమిషాల ముందు రావణ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఆయన ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తనపై కావాలనే వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 'నన్ను ఇలా మానసికంగా, శారీరకంగా వేధించే బదులు నేరుగా పోలీస్ స్టేషన్‌లోనే చంపేయండి' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గత మూడు రోజులుగా తాను పోలీస్ కస్టడీలోనే , కనీసం నీళ్లు కూడా ముట్టలేదని వెల్లడించారు. తనను చంపకుండా ఇలా రాష్ట్రంలోని అన్ని స్టేషన్ల చుట్టూ తిప్పినా.. తానే ఆహారం పూర్తిగా మానేసి ప్రాణాలు విడుస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం తన ఒక్కడిని బంధించడానికి ప్రభుత్వం వందలాది మంది పోలీసులను, ఎస్పీ స్థాయి అధికారులను కాపలా పెడుతోందని పోలీసుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రజా సమస్యలనేవే లేవా? పోలీసులు అన్ని పనులు మానుకుని కేవలం ఒక యూట్యూబర్ వెంట పడటం ఏంటని రావణ్ ప్రశ్నించారు. తన వెనుక ఉండి ఎవరు ఈ కక్ష సాధింపు రాజకీయాలు నడిపిస్తున్నారో ప్రజలందరికీ బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. భౌతికంగా తనను నిర్బంధించవచ్చని, చంపవచ్చునని.. కానీ సమాజాన్ని ప్రశ్నించే తన గొంతును తన 'ప్రశ్న'ను ఎప్పటికీ చంపలేరని స్పష్టం చేశారు. ఒక కేసులో బెయిల్ రాగానే చట్టాన్ని అడ్డం పెట్టుకుని మరో కేసుతో వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, ఈ వ్యవహారం కేవలం ఒక యూట్యూబర్ అరెస్టుకే పరిమితం కాకుండా ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారంగా మారింది. ప్రముుఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఈ అరెస్టుల పర్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకరిని టార్గెట్ చేసి వరుస కేసులు పెట్టడం సరైంది కాదంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఏ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేందుకు కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్న రావణ్, నటుడు ప్రకాష్ రాజ్ ఇద్దరూ సమాజంలో అలజడి సృష్టించే సంఘ విద్రోహ శక్తులుగా మారిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు.