విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ భవిష్యత్తు రవాణా వ్యవస్థకు కీలకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి దూకుడు పెంచింది. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఆశించిన స్థాయిలో మెట్రో ఫేజ్-2 పురోగతి కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి నేరుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు లేఖలు రాశారు. ఈ ప్రాజెక్టు ఆమోద ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్య, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుంటే మెట్రో విస్తరణ అత్యవసర అవసరంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తన లేఖల్లో పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు ఆధునిక ప్రజారవాణా వ్యవస్థ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని.. అందుకే మెట్రో ఫేజ్-2కు కేంద్రం తక్షణ ఆమోదం ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా ఆలస్యం అవుతోందని సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా ప్రాజెక్ట్ ఆర్థిక విలువను నిర్ధారించే బాధ్యతలను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని గతంలో నిర్ణయించినప్పటికీ.. ఆ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడం వల్ల మొత్తం ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కొనసాగితే నిర్మాణ వ్యయం మరింత పెరిగి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన రుణాల రీఫైనాన్సింగ్ అంశంపైనా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రుణాల పునర్వ్యవస్థీకరణపై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఫేజ్-2 నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.ఇటీవల ఢిల్లీలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్, అశ్వినీ వైష్ణవ్‌లతో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటివరకు అమల్లోకి రాకపోవడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మెట్రో మొదటి దశ వ్యయాన్ని తిరిగి అంచనా వేయడం, రెండో దశ నిర్మాణ వ్యయాన్ని ఖరారు చేయడం కోసం ఎస్‌బీఐ క్యాప్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం తన ప్రతినిధిని నియమించలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను తమ ప్రతినిధిగా నియమించినప్పటికీ.. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో మొత్తం ప్రక్రియ ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరోసారి కేంద్రానికి లేఖ రాసి వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.హైదరాబాద్ మెట్రో ఫేజ్-1కు సంబంధించిన ఆర్థిక అంశాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా మారాయి. మొదటి దశ కోసం జపాన్ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణంలో రూ.13,600 కోట్లు ప్రస్తుతం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వద్ద ఉన్నాయి. మరోవైపు ఎల్ అండ్ టీతో కుదిరిన ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించింది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని తిరిగి సమీక్షించి విలువను ఖరారు చేసిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉండటంతో ఎస్‌బీఐ క్యాప్స్ నివేదిక అత్యంత కీలకంగా మారింది.