పశ్చిమగోదావరి జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హత్య ఉదంతం కలకలం రేపుతోంది. భీమవరం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనంతవాణి అనే 32 ఏళ్ల మహిళకు ఇంకా వివాహం కాలేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారు. అయితే అనంతవాణికి అదే మండలానికి చెందిన శ్యాంబాబు అనే ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఐదేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. శ్యాంబాబుతో అనంతవాణి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆటో డ్రైవర్‌ శ్యాంబాబుకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్యాంబాబు భార్య దుబాయ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే శ్యాంబాబుకు అనంతవాణి పరిచయమయ్యారు.అయితే గత ఆరు నెలలుగా అనంతవాణి శ్యాంబాబుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న శ్యాంబాబు.. కక్షగట్టారు. ఈ క్రమంలోనే శనివారం రోజు అర్ధరాత్రి సమయంలో అనంతవాణి ఇంటికెళ్లాడు శ్యాంబాబు. అక్కడ అనంతవాణితో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అడ్డువచ్చిన అనంతవాణి తండ్రిని తోసేసి ఆమె పొత్తికడుపులో బలంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో అనంతవాణి తీవ్రంగా గాయపడగా.. ఆమె తండ్రి వెంటనే భీమవరం గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అనంతవాణి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతవాణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న భీమవరం గ్రామీణం పోలీసులు.. శ్యాంబాబు కోసం గాలిస్తున్నారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు జరుపుతున్నారు. ఏలూరు జిల్లాలో విషాదం..మరోవైపు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని చేబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద రైలు ఢీకొని నలుగురు వ్యక్తులు చనిపోయారు. శనివారం రాత్రివేళ ఈ ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. చర్లపల్లి షాలిమర్ ప్రత్యేక రైలు వీరిని ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాద తీవ్రతకు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుల వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు వీరందరూ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.