హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ఆయన సోదరులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతుతోనే ఒవైసీ ధైర్యంగా వ్యవహరిస్తున్నారని.. మండిపడ్డారు. చివరికి న్యాయవ్యవస్థను కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్లారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఫాతిమా కాలేజీ.. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తేలినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలు ఎదుర్కొంటూ.. హైకోర్టును ప్రశ్నించడం సరికాదని బండి సంజయ్ పేర్కొన్నారు. హైకోర్టు పలుమార్లు అవకాశం ఇచ్చినా.. ఫాతిమా విద్యాసంస్థలకు సంబంధించిన నివేదికలు, చట్టపరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిందని బండి సంజయ్ గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారంలో స్పందించకుండా ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు. గండిపేట ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న ఇతర విద్యాసంస్థలకు అధికారులు వరుస నోటీసులు జారీ చేస్తున్నారని.. అదే సమయంలో ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యాసంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఒకరికి ఒక చట్టం, మిగతా వారందరికీ మరో చట్టమా అని ప్రశ్నించారు. ఫాతిమా విద్యాసంస్థలపై గతంలో దర్యాప్తు సంస్థలు కొన్ని అంశాలను గుర్తించాయని పేర్కొన్న బండి సంజయ్.. విద్యాసంస్థల కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆరోపణలకు సమాధానం చెప్పకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని.. చట్టానికి అందరూ సమానంగా లోబడి ఉండాలని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమంగా నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలను కూల్చివేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు. అదే సమయంలో ఫాతిమా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అక్రమాలకు పాల్పడిన వారికి భయమంటే ఏంటో చూపిస్తామని ఓవైసీ బ్రదర్స్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు.