తెల్లవారితే పెళ్లి.. ముందు రోజు రాత్రి వధూవరుల్ని ఓ వాహనం ఎక్కించి ఊరిలో ఊరేగింపు చేస్తున్నారు. ఇరు కుటుంబాలవారు, బంధువులు, స్నేహితులు ఈ వేడుకలో సందడి చేశారు.. అందరూ డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో చిన్న వివాదం మొదలై పెళ్లి కూడా ఆగిపోయింది. వరుడు చెప్పిన మాటతో వధువు తండ్రికి కోపం వచ్చింది.. వెంటనే పెళ్లి రద్దు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకీ ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు మ్యాటర్ తెలిసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్ అయ్యింది. మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చిన్నగానిపల్లికి చెందిన యువకుడికి.. కంభం మండలం తురిమెళ్లకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం ఉదయం వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఒక రోజు ముందుగానే.. అంటే శనివారం రాత్రి వధువుతో పాటు కుటుంబసభ్యులు చిన్నగానిపల్లికి వెళ్లారు. అనంతరం వధూవరుల్ని ఓ వాహనంపై ఊరేగించారు. రెండు కుటుంబాలకు చెందినవారు డ్యాన్స్‌లు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా వధూవరులు కూడా తమతో కలిసి డ్యాన్స్ చేయాలని అందరూ ఒత్తిడి చేశారు. వధువు అందరితో కలిసి డ్యాన్స్ చేయడానికి సిద్ధమైంది.. వరుడు మాత్రం తాను డ్యాన్స్‌ చేయనని తేల్చి చెప్పాడు. ఆయన డ్యాన్స్ చేయనని చెప్పడం పక్కన పెడితే.. ‘నువ్వూ చేయడానికి వీల్లేదు’ అంటూ వధువును హెచ్చరించాడు. వధువుపై వరుడు ఆగ్రహం వ్యక్తం చేయడం ఆమె తండ్రికి నచ్చలేదు. వరుడు పెళ్లికి ముందే ఇలా ఉన్నాడని.. తర్వాత తన కూతురి విషయంలో ఇంకెలా ఉంటాడోననిఆలోచించాడు. వెంటనే తన కుమార్తెను ఊరేగింపు వాహనం నుంచి కిందకు దించి పెళ్లి వద్దని తన కుటుంబ సభ్యులు, బంధువుల్ని తీసుకుని అక్కడి నుంచి బయల్దేరి సొంతూరికి వెళ్లిపోయారు. వివాహం ఆగిపోవడంతో ఇరు కుటుంబాలు ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలకు సంబంధించిన లావాదేవీలను సెటిల్‌ చేసుకున్నారు. అయితే అప్పటికే వరుడి కుటుంబం సభ్యులు భారీగా డబ్బులు ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద చిన్న కారణానికే వివాహం ఆగిపోయింది.