ఆస్ట్రేలియా ఏడోసారి వరల్డ్ ఛాంపియన్.. ఇంగ్లాండ్‌కు నిరాశ..!

Wait 5 sec.

మహిళల క్రికెట్‌లో తమకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. స్థిరత్వంలో తమకు సాటి వచ్చే జట్టు లేదని చాటి చెబుతూ.. మరోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో విజేతగా నిలిచింది. రికార్డు స్థాయిలో ఏడోసారి ఈ టోర్నీ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2026లో ఆడిన ఏడు మ్యాచులలోనూ గెలిచి.. ఏడో టైటిల్ సాధించింది.క్రికెట్ మక్కాగా పేరు పొందిన లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం ఈ ఫైనల్ జరిగింది. లీగ్ దశలో ఈ రెండు జట్లూ కూడా ఒక్క మ్యాచులోనూ ఓడిపోలేదు. దీంతో పోరు హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ ఐసీసీ నాకౌట్స్‌లో అదరగొట్టే ఆసీస్.. మరోసారి అదే రిపీట్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి, ఫైనల్‌ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. ఈ టోర్నీలో ఓటమి లేకుండా ఫైనల్ వరకూ వచ్చిన ఇంగ్లాండ్.. తుది పోరులో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆది నుంచి వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. వేగంగా రన్స్ రాబట్టలేకపోయింది. ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ న్యాట్ సీవర్ బ్రంట్ చివరివరకూ క్రీజులో ఉన్న వేగంగా రన్స్ చేయలేకపోయింది. 53 బంతుల్లో 58 రన్స్ చేసి అజేయంగా నిలిచింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, లుకీ హామిల్టన్, సోఫీ మొలినిక్స్, అన్నాబెల్ సదర్లాండ్ ఒక్కో వికెట్ తీశారు.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. బెథ్ మూనీ (49 బంతుల్లో 64 రన్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేసింది. లిచ్‌ఫీల్డ్ 35 బంతుల్లో 48 రన్స్ చేసింది. దీంతో ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఏడోసారి మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది.