అయోధ్య రామజన్మభూమి ఆలయంలో విరాళాల దుర్వినియోగం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అవినాశ్ శుక్లా బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 15 లక్షలకు పైగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును పలువురికి ఆన్‌లైన్ ద్వారా ఇవ్వడంతో పాటు.. ఇంకొందరికి నగదు రూపంలో కూడా ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. అవినాశ్ శుక్లా తన గర్ల్‌ఫ్రెండ్‌కి సుమారు రూ. 2 లక్షల నగదుతో పాటు ఖరీదైన ఫోన్ బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిధులు అన్నీ ఆలయ విరాళాల నుంచి మళ్లించినవేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చిన డబ్బు కూడా ఆలయ విరాళాల నుంచే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవినాశ్ శుక్లా సోదరుడు అభిషేక్ వాంగ్మూలం ప్రకారం డ్యూటీ అయిపోయిన తర్వాత అవినాశ్ తరచూ పెద్ద మొత్తంలో నగదు తీసుకుని ఓ యోగా కేంద్రానికి వెళ్లేవాడని చెప్పాడు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తోందని ప్రశ్నించగా, అవినాశ్ నిజాలు చెప్పేవాడు కాదని కూడా అభిషేక్ చెప్పాడు. ఈ కేసులో అవినాశ్ సోదరుడుతో పాటు మరో వ్యక్తి అనుకల్ప్‌ను కూడా ప్రశ్నించగా.. భక్తులు కొందరు తనకు డబ్బులు ఇస్తారని, అదేవిధంగా దర్శనం సమయంలో కొందరికి సహాయం చేసినందుకు కూడా కొందరు నగదు ఇస్తారని అవినాశ్ తనకు చెప్పాడంటూ అనుకల్ప్ చెప్పాడు. ఇంకోసారి ఈ విషయం గురించి అడగొద్దని కూడా హెచ్చరించినట్లు తెలిపాడు. అయితే, ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం జూలై 3న రామాలయ ప్రాంగణానికి చేరుకుని మరిన్ని ఆధారాలు సేకరించింది. దర్యాప్తు పూర్తి చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్‌కు 15 రోజుల గడువు పొడిగించింది. దాంతో అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో జూన్ 23న సిట్ ప్రాథమిక నివేదిక సమర్పించగా, జూన్ 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.