" ప్రభుత్వంతో పోరాడే బలం మాకు లేదు.. మా వారితో పాటు మమ్మల్ని చంపేయండి".. ప్రశ్న రావణ్ భార్య

Wait 5 sec.

తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుల వ్యవహారంపై ఆయన భార్య అనూష తొలిసారిగా స్పందించారు. సోషల్ మీడియాలో ప్రశ్న రావణ్ గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ వీడియో, పత్రికా ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిందే తన భర్త మాట్లాడాడని.. ఆయనకో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను వేధించడం ఆపేయాలంటూ వీడియోలో వేడుకున్నారు. "మా వారిపై కేసుల మీద కేసులు పెట్టి.. స్టేషన్లు తిప్పుతున్నారు. వాటికి ఆయన బెయిల్ తెచ్చుకుంటుంటే.. మళ్లీ కేసులు వేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు ఇంత వేధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిందే మా ఆయన మాట్లాడాడు. ఇవే కేసులు పవన్ కళ్యాణ్ మీద కూడా వేయాలి కదా. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసులు పెట్టి వేధించొద్దు. మా పాప వాళ్ల నాన్న కావాలని బాధపడుతోంది. మా పసిపాప ముఖం చూసైనా ఇవి ఆపేయండి. లేదంటే మా ఇంట్లో వారంతా చనిపోతాం. ఒక్కసారి ఆలోచించండి సార్.. మిమ్మల్ని ప్రశ్నించడమే మావారి తప్పు అయితే.. మా ఆయనతో పాటు నన్ను, మా పాపను కూడా చంపేయండి." అంటూ వీడియో విడుదల చేశారు. ఇక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రావణ్ వీడియో ఫేక్ వీడియో అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు అనూష. "యూట్యూబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో. అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్ధించుకునేందుకు, లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కావున. నా భర్తది కమ్మ కులం. నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతో సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ. అదే వర్గానికి చెందిన రావణ్." అని పేర్కొన్నారు. "సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌ది తప్ప, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు. ఒక ప్రజాస్వామ్య వాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి. లేదంటే, లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకానీ, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనలనుంచి డైవర్ట్ చేయడానికే రావణ్‌ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు." అని ఆరోపించారు. "ఒక ప్రభుత్వంతో పోరాడేంత బలం మాకు లేదు. కాని నిజాయితీ మాకు ఉంది. కాకపోతే రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే, అది ఈ సమాజానికి మంచిదికాదు. ఈ దేశంలో కాస్త ఆలస్యమైన, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది.ప్రజలందరికీ మా కుటుంబం తరపున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నా" అంటూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.