‘బయట ఉండటానికి వీల్లేదు’.. ప్రశ్న రావణ్‌పై ‘ఉపా’ కేసుపై ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందన..

Wait 5 sec.

ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ స్పందించారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని చెప్పడం కోసం, సమాజంలో భయోత్పాతం సృష్టించడం కోసం రావణ్‌ను అరెస్ట్ చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రావణ్‌ను నాలుగుసార్లు అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చిందని.. ఈ సారి బెయిల్ రాకుండా ఉండటం కోసం ఏం చేయాలని ఆలోచించే ఉపా చట్టం కింద ప్రశ్న రావణ్‌పై కేసు నమోదు చేసినట్లు అర్థమవుతోందన్నారు.‘‘ఉపా చట్టం కింద ఎప్పుడు కేసు నమోదు చేయాలనే విషయమై.. 2020లో అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టంగా మార్గదర్శకాలు జారీ చేసింది. అరెస్ట్ వెనుక కారణాలేంటని పోలీసులు స్పష్టంగా పేర్కొనాలి. జడ్జి కూడా ఆ కారణాలతో సంతృప్తి చెందితేనే అరెస్ట్ చేయాలి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది’’ అని ప్రొఫెస్ నాగేశ్వర్ తెలిపారు.‘‘తీవ్రమైన అభియోగాలు, ఏడేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో మాత్రమే అరెస్టుకు వీలు ఉంటుంది. దీనిపై అనేక సందర్భాల్లో కోర్టు ధిక్కారణ కేసులు నమోదయ్యాయి. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో కోర్టు తీర్పులను ఉల్లంఘించి, ఇష్టం వచ్చినట్లు అరెస్ట్ చేస్తే పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. జడ్జిలపైనా చర్యలు తీసుకోవచ్చు’’ అని వెల్లడించారు.‘‘రావణ్‌కు బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే ఉపా చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు స్పష్టం అవుతోంది. బెయిల్ రావొద్దనే అనే లక్ష్యంతో కేసు పెట్టినట్లు ఉంది తప్పితే, నేర తీవ్రతను బట్టి బెయిల్ రాకపోవడం కాదు. ఇది కక్ష సాధింపు అని క్లియర్‌గా అర్థం అవుతోంది. ఏలూరు సభలో రావణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చాలా తీవ్ర భాషలో మాట్లాడాడు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో, మాట్లాడిన వీడియో రెండూ ప్లే చేస్తూ.. ఈ రెండింటిలో భాష, శైలి, ఆవేశం.. అన్నీ ఒకే రీతిలో ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్‌కు వర్తించని చట్టం, రావణ్‌కు ఎందుకు వర్తిస్తుందనే విమర్శలొస్తున్నాయి’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.‘‘ఉపన్యాసాల్లో మాట్లాడిన మాటలకే ఉపా చట్టం కింద కేసులు పెట్టాలంటే.. ఏపీలో పోలీసులు సరిపోరు. రాజకీయ నాయకుల్లో 90 శాతం అరెస్ట్ కావాలి. బయట ఉండటానికి వీల్లేదు. రాజకీయ నాయకులు రోజూ ఇంతకంటే తీవ్రమైన భాష, పదజాలంతో అసెంబ్లీ లోపల, బయట తిట్టుకుంటున్నారు కదా. రాజకీయ నాయకులపై ఉపా చట్టం ఎందుకు ప్రయోగించడం లేదు. రాజ్యంపై ప్రశ్నిస్తే మేం ఏం చేస్తామో చూడండని చెప్పడానికి.. సమాజంలో ఒక భయోత్పాతాన్ని కలిగించడం కోసమే ఈ కేసు పెట్టారనిపిస్తోంది’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.‘‘ఎన్వీ రమణ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్నప్పుడు ఉపా చట్టం దుర్వియోగం గురించి మాట్లాడుతూ.. ‘చెట్టును కోయమని రంపం ఇస్తే.. అడవినే నరికేశారు’ అని వ్యాఖ్యానించారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు, సార్వభౌమాధికారానికి ప్రమాదకరంగా మారుతున్న తీవ్రవాద శక్తులను అరికట్టడానికి ఈ కఠిన చట్టం వచ్చింది. అభ్యంతరకరంగా అనిపించిన మాటలకు కూడా ఉపా చట్టా్న్ని వర్తింపజేయడం ప్రమాదకరం. రేపటి రోజున తీవ్రవాదులపై కేసులు పెట్టినా.. రాజ్యం చర్యలను ప్రజలు అనుమానిస్తారు. ఇది మంచిది కాదు. తీవ్రమైన నేరాలకు ఉపయోగించాల్సిన చట్టాన్ని సాధారణమైన అంశాలకు ప్రయోగించడం ప్రమాదకరం’’ అని నాగేశ్వర్ హెచ్చరించారు.సాధారణ చట్టాలతో పోలిస్తే.. ఉపా చట్టం కింద కేసులు పెడితే బయటకు రావడం కష్టం అవుతోంది. ఇది నిజంగా భయోత్పాతాన్ని కలిగించే చర్య. ప్రత్యర్థి పార్టీ నుంచి ఏ విమర్శ వచ్చినా తమను తాకదు.. కానీ పౌర సమాజం నుంచి వచ్చిన వారి నుంచి ప్రశ్నలు వస్తే తమను తాకుతాయనేది అధికారంలో ఉన్న వారి ఆలోచన అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.‘‘. ఏపీలో ఎలాంటి సమస్యలు లేనట్టు నా చుట్టూ తిరిగింది. ఇప్పుడు వారం రోజులపాటు ప్రశ్న రావణ్ చుట్టూ తిరుగుతోంది. మామిడి రైతుల నష్టాలు, పొగాకు రైతుల కష్టాలు, వీబీ జీ రామ్ వల్ల ఉపాధి హామీ కూలీలకు వచ్చే నష్టం లాంటివి వెనక్కి పోయాయి. ప్రశ్న రావణ్ అరెస్ట్ వెనుక డైవర్షన్ వ్యూహాలు ఉన్నాయా అనే అనుమానం కూడా కలుగుతుంది. భయపెట్టడం, ప్రజాసమస్యల నుంచి పక్కదారి పట్టించడం రావణ్ అరెస్ట్‌కు కారణం కావచ్చు.మమ్మల్ని ఎవరు ప్రశ్నించినా ఇదే గతి పడుతుందని భయపెట్టడం కోసమే ఇలా అరెస్ట్ చేస్తున్నారు. కేసులు పెట్టడానికి అభ్యంతరకర వ్యాఖ్యలు కారణం కాదు. నా 40 ఏళ్ల జర్నలిజం కెరీర్లో ఏనాడూ అభ్యంతరకర రీతిలో మాట్లాడలేదు. అయినా సరే నాపై కేసులు పెట్టారు. దీన్నిబట్టి నాకు అర్థమైంది ఏంటంటే.. కేసులు పెట్టడానికి మాట్లాడిన తీరు కారణం కాదు. మాట్లాడొద్దు అని హెచ్చరించడానికే కేసులు పెడుతున్నారు’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషించారు.‘‘నేర తీవ్రతను బట్టి కేసులు ఉండాలి కానీ.. ఇష్టం వచ్చినట్లు కేసులు ఎలా పెడతారు. కోర్టులు బెయిల్ ఇస్తుంటే.. అడ్డుకోవడానికి కూడా కేసు తీవ్రతను పెంచుతామనడం సరికాదు. నిర్బంధం పెరుగుతున్న కొద్దీ.. ప్రజల్లో వ్యతిరేక అభిప్రాయం పెరుగుతుంది. ప్రజాస్వామ్యంలో నిర్బంధం ఎప్పుడూ పరిష్కారం కాదు. తప్పుడు మార్గంలో ఎవరైనా మాట్లాడితే కౌంటర్ ఇవ్వండి, మాటకు మాట సమాధానం చెప్పండి. అభ్యంతరకరంగా మాట్లాడిన వారందరిపై కేసులు పెడితే అదొక రకం. కానీ అలా చేయడం లేదు కదా. ఈ ధోరణి ప్రజల దృష్టిని ఎంతో కాలం మళ్లించదు’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ హితవు పలికారు.