తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గడిచిన కొన్ని రోజులుగా కురుస్తుండగా.. రాబోయే రోజుల్లో ఇవి మరింత తీవ్రం కానున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో శనివారం ఉదయం ఏర్పడిన బలమైన అల్పపీడనం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటమే కాకుండా.. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ఫలితంగా రాబోయే మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా విస్తారంగా వానలు దంచికొట్టనున్నాయి.నేడు, రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆ నాలుగు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కేవలం వర్షాలే కాకుండా.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.మరోవైపు, ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాలపై కూడా ఈ అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ జిల్లాల పరిధిలోని వాగులు, వంకలు పొంగిపొర్లే అవకాశం ఉండటంతో రవాణా వ్యవస్థకు అంతరాయం కలగవచ్చునని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, శనివారం నాడు కూడా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం ఎల్కపల్లిలో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇదే జిల్లాలోని సిర్పూర్‌(టి)లో 3.8 సెం.మీ, వాంకిడిలో 3.8 సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం చాప్రాలాలో 3.5 సెం.మీ, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలో 3.4 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.ఈ భారీ వర్షాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఉపనదులు ఉధృతంగా ప్రవహించే ఆస్కారం ఉండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, చెట్లు విరిగిపడటం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున.. విద్యుత్ శాఖ సిబ్బందిని ఎమర్జెన్సీ సేవల కోసం సిద్ధంగా ఉంచారు. నగరాలు, పట్టణాల్లోని మునిసిపల్ అధికారులు డ్రైనేజీ వ్యవస్థలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు వాతావరణ సూచనలను గమనించి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.