పెళ్లికి ముందు లైంగిక సంబంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు.. తెలంగాణ ట్రైనీ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Wait 5 sec.

పెళ్లికి ముందు శారీరక సంబంధాలపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు మేజర్ల పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దానిని చట్టపరంగా తప్పుగా చూడలేమని పేర్కొంది. కేవలం లైంగిక సంబంధాల ఆధారంగా ఓ వ్యక్తి క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని, అది రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు అని తేల్చిచెప్పింది. ఈ మేరకు తెలంగాణకు చెందిన తిరుపతి అనే ఓ ట్రైనీ కానిస్టేబుల్‌కు పోస్టింగ్‌‌ను నిరాకరించడాన్ని జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం తప్పుబట్టింది. ప్రేమలో ఉన్న ప్రతి బంధం వివాహం వరకు వెళ్లకపోవచ్చని, అంతమాత్రాన వారికి నైతికత లేదని ఎలా నిర్ణయిస్తామని వ్యాఖ్యానించింది.పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన గాజుల తిరుపతి.. 2014లో తనకు పరిచయం ఉణ్న యువతితో పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో అతడి ప్రవర్తన సరిగ్గా లేదంటూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరించి, నియమాకాన్ని రద్దుచేసింది. దీంతో అతడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఈ విషయం 2015లో లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్నామని, తన దరఖాస్తు ఫారంలో ఈ కేసు గురించి వెల్లడించినట్టు వివరించాడు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విని తిరుపతికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో ఇద్దరు మేజర్లు శారీరక బంధం పెట్టుకుంటే దానిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ప్రతి ప్రేమ బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఒకే ఒక్క కారణంతో వ్యక్తి ప్రవర్తన, వ్యక్తిత్వంపై నిర్ణయానికి రావడం సరికాదని పేర్కొంది. నైతికత, చట్టం వేర్వేరని.. ఉద్యోగ అర్హతలను వ్యక్తిగత ఇష్టాయిష్టాలు శాసించలేవని ధర్మాసనం వెల్లడించింది. ‘‘ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లదు.. అందువల్ల ఒకరు మరొకర్ని మోసం చేశారని నమ్మడానికి అది ఆధారం కాదు’’ అని పేర్కొంది.గాజుల తిరుపతికి అనుకూలంగా తీర్పు చెప్పిన ధర్మాసనం.. తక్షణమే అతడికి పోస్టింగ్ ఇవ్వాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. అలాగే, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని బోర్డును సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ తీర్పుతో క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలపై సరికొత్త చర్చ మొదలైంది.