: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలోని అత్యంత విలువైన కంపెనీగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Reliance Industries Ltd) షేర్లు భారీగా పడిపోతున్నాయి. దిగ్గజ పారిశ్రామికవేత్త నేతృత్వంలోని ఈ కంపెనీ స్టాక్ వరుసగా 9వ ట్రేడింగ్ సెషన్‌లోనూ భారీగా నష్టపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీగా అమ్మకాల ఒత్తిడి ఉండడం, విదేశీ మదుపరులు భారీగా అమ్మకాలు చేపట్టడం వంటి కారణాలతో ఈ స్టాక్ భారీగా పతనమవుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ స్టాక్ గురించిన వివరాలు ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూన్ 8వ తేదీన ట్రేడింగ్ సెషన్ చూసుకుంటే ఇంట్రాడేలో రూ.1270.60కి పడిపోయింది. ఇక గత 9 రోజుల వరుస నష్టాలు గమనిస్తే ముకేశ్ అంబానీ కంపెనీ స్టాక్ 7 శాతం మేర నష్టపోయింది. దీంతో ఈ 9 సెషన్లలోనే ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.1,29,000 కోట్ల మేర ఆవిరైపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.18.49 లక్షల కోట్ల నుంచి రూ.17.10 లక్షల కోట్లకు తగ్గిపోయింది. అలాగే ఈ ఏడాది 2026లో ఇప్పటి వరకు చూసుకుంటే రిలయన్స్ షేరు ధర 19 శాతం మేర పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో సరిగ్గా పనితీరు కనబరచని స్టాక్స్‌లో నిలిచింది. రిలయన్స్ షేర్లలోని ధరల కదలిక ఒక్కరోజు భయాందోళనను కాకుండా నిరంతర సరఫరాను సూచిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండెక్స్ సెంటిమెంట్, పాసివ్ ఫ్లోస్, విస్తృత మార్కెట్ విశ్వాసంపై ఈ స్టాక్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పవచ్చు. మరోవైపు 2026, జూన్ 19వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ యాన్యువల్ జనరల్ మీటింగ్ (AGM) ఉంది. ఈ క్రమంలో ఈ స్టాక్ భారీగా పడిపోవడం గమనార్హం. మార్కెట్ వర్గాల ప్రకారం అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఏర్పడిన చమురు ధరల అస్థిరత, మార్జిన్ స్ప్రెడ్‌ల కారణంగా ఈ స్టాక్‌పై ఆందోళన నెలకొంది. చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, అది ముడిసరుకు ఖర్చులను పెంచి, డిమాండ్‌ను బలహీనపరుస్తుంది, ఫలితంగా పెట్రోకెమికల్ స్ప్రెడ్‌లు తగ్గే అవకాశం ఉంది.గ్రూప్ EBITDAలో దాదాపు మూడింట ఒక వంతు వాటాను అందించే కీలక లాభాలు రిలయన్స్ రిఫైనింగ్ వ్యాపారం నుంచే వస్తున్నాయి.మరోవైపు, పెరిగిన ముడిసరుకు ఖర్చులు, ఇరాన్ యుద్ధానికి సంబంధించిన సరఫరా అంతరాయాల కారణంగా కంపెనీ త్రైమాసిక లాభాల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ కారణాలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. విదేశీ మదుపరులు భారీగా అమ్మకాలు చేపట్టడమూ స్టాక్స్ నష్టపోయేందుకు కారణమవుతున్నాయి.