త్వరలోనే శుభవార్త చెబుతాం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన అప్పటి నుంచి ఇప్పటివరకు నదీ జలాల పంపకాల విషయంలో తీవ్ర వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతీ సంవత్సరం వర్షాకాలం సమయంలో రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు.. నేతలు, పార్టీలు, ప్రభుత్వాల మధ్యనే కాకుండా కేంద్ర ప్రభుత్వం వరకు వెళ్తూనే ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణ నదీ జలాల విషయంలో జగడం జరుగుతూనే ఉంది. ఈ రెండు నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల శక్తి శాఖ సహా పలు కమిటీలు చర్చోపచర్చలు జరిపినప్పటికీ.. ఈ నదీ జలాల పంపకాల విషయంలో మాత్రం చిక్కుముడి వీడటం లేదు. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి .. ఏపీ, తెలంగాణ నదీ జలాల పంపకాలపై ఆసక్తికర ప్రకటన చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. పాలమూరు ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలపై ఏపీ సర్కార్‌తో చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల నదీ జలాల వివాదాలు చాలా తొందర్లోనే ఒక కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంలో త్వరలోనే తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్త కూడా చెబుతామని ధీమాగా వెల్లడించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నప్పటికీ.. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్కను కూడా వదులుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టి చెప్పేశారు. తాము ఆంధ్రప్రదేశ్‌తో పంచాయతీ కంటే సమస్యల పరిష్కారానికే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తామని తెలిపారు. కాగా పాలమూరు, డిండి వంటి పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ (ఎన్ఓసీలు) వస్తేనే.. మిగిలిన ప్రాజెక్టులపై చర్చలు ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో పాలమూరులో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శలు గుప్పించారు. ఇక పాలమూరు ప్రాజెక్టుకు కనీసం భూసేకరణను కూడా బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయలేకపోయిందని.. దీనివల్ల ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించలేకపోయిందని మండిపడ్డారు. ఇక గత ఎన్నికల్లో కష్టకాలంలో ఉన్న కేసీఆర్‌ను పాలమూరు జిల్లా ఆదుకుందని తెలిపిన రేవంత్ రెడ్డి.. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయన పాలమూరు జిల్లాను పూర్తిగా పట్టించుకోవడమే మానేశారని ఆరోపించారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు.. కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను స్వయంగా తానే తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఆ జిల్లా ప్రజలకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.