మోదీ ఢిల్లీ గద్దెనెక్కి నేటితో 12 ఏళ్లు.. దేశ రాజధానిలో ఎన్డీఏ కీలక భేటీ!

Wait 5 sec.

ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించి నేటితో 12 ఏళ్లు పూర్తయింది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రధాన మంత్రిగా ఢిల్లీ గద్దెనెక్కిన నరేంద్ర మోదీ.. వరుసగా మూడు సార్లు పీఎంగా చరిత్ర సృష్టించారు. దేశ చరిత్రలో ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయం కొనసాగిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం ఎన్డీయే భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా హాజరుకానున్నాయి. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్.. రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. వీరితో పాటు ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలనను అభినందిస్తూ ఎన్డీఏ ఈ సమావేశంలో తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టనుండగా.. నాగాలాండ్ సీఎం నెఫ్యూ రియో బలపరచనున్నారు. తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం నరేంద్ర మోదీ ప్రసంగం ఉంటుంది. 2047 వికసిత్ భారత్ లక్ష్యం కోసం చేపట్ట్సాని సంస్కరణలపై మోదీ ప్రసంగం సాగే అవకాశం ఉంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రధాన సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి, పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల లబ్ధి చివరి వ్యక్తి వరకూ చేరాల చేసే చర్యలపై కూడా మాట్లాడనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్యవస్థీకరణపైనా ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ నేతృత్వంలో కొంత మంది మంత్రులను తీసుకునే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక మూడు పర్యాయాలుగా ప్రధానిగా కొనసాగుతున్న మోదీకి ప్రపంచ దేశాల నేతలూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మోదీకి లేఖ రాశారు. పపువా న్యూగినీ ప్రధాని జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిస్సెసార్ శుభాకాంక్షలు తెలిపారు.