సినిమా స్టోరీని తలదన్నేలా భార్య హత్యకు ప్లాన్.. కూరగాయల సంచితో దొరికిపోయిన కిరాతకుడు

Wait 5 sec.

ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే.. ఓ చిన్న తప్పు చేస్తుంటాడు. ఆ తప్పే అతడిని చట్టానికి దొరికేలా చేస్తుంది. అదే కోవలో ఓ వ్యక్తి భార్యను కిరాతకంగా హత్య చేయించి సినిమా స్టోరీని తలదన్నేలా కట్టుకథ అల్లాడు. అయితే ఓ కూరగాయల సంచి అతడు పోలీసులకు చిక్కేలా చేసింది. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మే 3న జరిగిన వివాహిత దారుణ హత్య కేసును సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. గుర్తుతెలియని వ్యక్తులు తన భార్య గొంతుకోసి చంపారంటూ భర్త అల్లిన కట్టుకథను ఆధారాలతో పోలీసులు బట్టబయలు చేశారు. తన చేతికి మట్టి అంటకుండా బిహార్‌కు చెందిన ఒక సుపారీ గ్యాంగ్‌ను రప్పించి కట్టుకున్న భార్యను పక్కా స్కెచ్‌తో హతమార్చిన కిరాతక భర్త అసలు రంగును బయటపెట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన భర్తతో పాటు బిహార్ సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఒక నిందితుడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి.పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అనిల్‌ కుమార్, మీనాదేవి దంపతులు గత కొంతకాలంగా సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అనిల్ స్థానికంగా ఉండే ఒక ఇనుము తయారీ పరిశ్రమలో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తూ.. వాహనాలను కూడా అద్దెకు ఇస్తుంటాడు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ రోజువారీ గొడవలతో విసిగిపోయిన అనిల్.. భార్య మీనాదేవిని వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా.. సినిమా ఫక్కీలో కథ అల్లి ఆమెను అంతమొందించేందుకు బిహార్‌కు చెందిన నలుగురు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హైదరాబాద్ రప్పించాడు.పథకం ప్రకారం మే 30న సాయంత్రం అనిల్ తన భార్యను తీసుకుని ఐడీఏ బొల్లారం పరిధిలోని స్థానిక వారపు సంతకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత రాత్రి వేళ బైక్‌పై తిరుగుప్రయాణమయ్యారు. దారి మధ్యలో నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే అనిల్ కావాలనే బైక్‌ను ఆపేశాడు. వాహనం రిపేర్ చేస్తున్నట్లు నటిస్తుండగా.. పొదల్లో మాటువేసిన ముగ్గురు సుపారీ హంతకులు అకస్మాత్తుగా వచ్చి మీనాదేవిని పొదల్లోకి లాక్కెళ్లారు. తానకేమీ తెలియదన్నట్లు అనిల్ మొదట కొంతదూరం పారిపోయి.. మళ్లీ కాపాడేందుకు వెనక్కి వచ్చినట్లు డ్రామా ఆడాడు. దుండగులు తన కళ్ల ముందే భార్య గొంతుకోసి చంపారని అడ్డుకోబోయిన తనపై కత్తులతో దాడి చేశారని అనిల్ బోరున ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అనిల్ ప్రవర్తన మొదటి నుంచి విచిత్రంగా అనిపించింది. అతడి చేతులు, వీపుపై ఉన్న కత్తి గాట్లు వేరొకరు దాడి చేసినట్లు కాకుండా కావాలనే బ్లేడు లేదా కత్తితో స్వయంగా కోసుకున్నట్లుగా ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. వీటన్నింటికీ మించి ఘటనా స్థలంలో దొరికిన ఒక కూరగాయల సంచి నిందితుల గుట్టు రట్టు చేయడంలో కీలక ఆధారంగా మారింది. గుర్తుతెలియని దుండగులు అకస్మాత్తుగా దాడి చేసి.. మహిళను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్తుంటే ఆమె చేతిలోని కూరగాయల సంచి కిందపడి, అందులోని వస్తువులు చెల్లాచెదురు కావాలి. కానీ ఆ సంచి మాత్రం ఏమాత్రం చెదరకుండా రోడ్డు పక్కన ఓ మూలన పద్ధతిగా పెట్టి ఉండటాన్ని దర్యాప్తు అధికారులు గమనించారు. నిందితులే ఆ సంచిని జాగ్రత్తగా పక్కన పెట్టారనే బలమైన అనుమానంతో అనిల్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. సుపారీ ఇచ్చి భార్యను చంపించిన అసలు బండారం బయటపడింది.