GSK Nuvalent Deal: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందుకే చాలా మంది.. మనకు ఇదెందుకురా బాబూ అనుకొని అటువైపు చూడరు. కొందరు ఏమాత్రం అవగాహన లేకున్నా మంచి రాబడి వస్తుందన్న ఆశతో పెట్టుబడి పెట్టి చేతులు కాల్చుకుంటారు. కానీ కొందరు మాత్రం స్టాక్ మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ.. ఓపికతో, ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతూ సంపాదిస్తుంటారు. అయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు సదరు కంపెనీల నుంచి వచ్చే ప్రకటనలు, ఫలితాలు, ఒప్పందాలు, ప్రణాళికలు, పెట్టుబడి వ్యూహాలు అన్నీ గమనిస్తూ ఉంటే.. సరైన సమయంలో దాంట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి అందుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. ఇక స్టాక్ మార్కెట్లలో ఆయా షేర్ల కదలికలు, హెచ్చుతగ్గుల గురించి ఇన్వెస్టర్లకు తెలిసే ఉంటుంది. ఏదైనా మంచి ప్రకటనలు వస్తే.. లేదా ఫలితాల్లో మంచి లాభం, ఆదాయం వస్తే ఇలాంటి సందర్భాల్లో స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లు కొడుతుంటాయి. ఇది సాధారణంగా 5 శాతమో, 10 శాతమో.. మహా అయితే 20 శాతం వరకు ఉంటాయి. అదే ప్రతికూల ఫలితాలు వచ్చినా.. ఇతర ఏదైనా నెగెటివ్ ప్రకటన వచ్చినా అదే స్థాయిలో లోయర్ సర్క్యూట్స్ కొడుతుంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్.. అంతకుమించి. అదే అమెరికా స్టాక్ ఎక్స్చేంజీల్లో నాస్‌డాక్‌లో లిస్టయి ఉన్న నువాలెంట్ కంపెనీ. ఈ స్టాక్ జూన్ 9 సెషన్‌లో ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో కనీవిని ఎరగని రీతిలో దూసుకెళ్లింది. అంతకుముందు సెషన్‌లో 88.49 డాలర్ల వద్ద ముగియగా.. మంగళవారం రోజు ఏకంగా నేరుగా 38 శాతానికిపైగా పెరిగి 122.82 డాలర్ల వద్ద సెషన్ ప్రారంభించింది. అక్కడితో ఆగకుండా మళ్లీ 39.28 శాతం లాభంతో 123.25 డాలర్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో దాదాపు 40 శాతం లాభంతో 123.62 డాలర్ల స్థాయి వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఇదే ఈ స్టాక్ ఆల్ టైమ్ హై వాల్యూ కావడం విశేషం. దీంతో ఒక్కరోజులోనే ఏకంగా 39 శాతం షేర్ ధర పెరగడంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారి దశ తిరిగిందని చెప్పొచ్చు. రికార్డు స్థాయిలో సొమ్ము చేసుకున్నారు. షేర్లలో ఈ స్థాయిలో కొనుగోళ్లు వెల్లువెత్తేందుకు ప్రధాన కారణం ఈ క్యాన్సర్ డ్రగ్ డెవలపర్ అయిన నువాలెంట్‌ను కొనుగోలు చేసేందుకు బ్రిటన్ ఫార్మా దిగ్గజం గ్లాక్సో స్మిత్ క్లైన్ (GSK) ముందుకు రావడమే. ఏకంగా 10.6 బిలియన్ డాలర్లతో నువాలెంట్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇది భారత కరెన్సీలో చూస్తే సుమారు రూ. 1.01 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇక్కడ ఒక్కో షేరుకు 124 డాలర్ల క్యాష్ చెల్లించనుంది. ఈ ఆల్ క్యాష్ డీల్‌తో జీఎస్‌కే.. తన అంకాలజీ (క్యాన్సర్ చికిత్స) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకోనుంది. ఈ కారణంతోనే షేర్లు ఒక్కసారిగా రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. Disclaimer: పైన ఇచ్చింది కేవలం సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడులకు సిఫార్సు కాదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. అందుకే ఆర్థిక నిపుణుల సలహాలు స్వీకరించడం మంచిది.