US - Iran మధ్య మళ్లీ యుద్ధమేఘాలు.. అమెరికా అపాచీ హెలికాప్టర్ కూల్చివేత, ఇరాన్‌ డైరెక్ట్ వార్నింగ్!

Wait 5 sec.

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ ఒమన్ తీరంలో కూలిపోయింది. దీనికి ఇరానే కారణమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరాన్ చేసిన తీరుకు ప్రతిస్పందన తప్పక ఉంటుందంటూ అమెరికా సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియాలో ప్రకటన కూడా చేసింది. హోర్ముజ్ జలసంధికి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్ ఇరాన్ కూల్చివేసిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు చేయడంపై ఇరాన్ కూడా స్పందించింది. తమకు కూడా హెర్ముజ్ సమీపంలోని ద్వీపంలో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా అధికారికంగా వెల్లడించింది. ఇరాన్ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. "హెర్ముజ్ జలసంధి అమెరికాకు వేల మైళ్ల దూరంలో ఉంది. హోర్ముజ్ మా భూభాగంలో ఉంది. మరి మా భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ బలగాలపై కాల్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే వారు వెళ్లిపోవడమే సరైన మార్గం" అంటూ అరాఘ్సీ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన తర్వాత అందులో ఉన్న ఇద్దరు పైలట్లు క్షేమంగానే బయటపడ్డారు. అమెరికా సైన్యం డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించింది. సైనిక చరిత్రలో సముంద్రంలో డ్రోన్ ద్వారా నిర్వహించిన తొలి రక్షణ చర్య కూడా ఇదేనని అమెరికా ప్రకటించింది. ట్రంప్ చెప్పినదాని ప్రకారం రాత్రి 3:30 గంటల సమయంలో డ్రోన్ బోట్ వారిని గుర్తించి సురక్షిత ప్రాంతానికి చేర్చింది. ఇరుదేశాల మధ్య ఒకవైపు దాడులు జరుగుతున్నప్పటికీ ట్రంప్ మాత్రం ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ అనడం విశేషం. అమెరికా - ఇరాన్ మధ్య ఒప్పందం కుదరాలంటే.. ఇరాన్ తమ యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడంతో పాటు ఆస్తులను కూడా విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.