మీనాక్షి నాటరాజన్ నామినేషన్‌ తిరస్కరణకు కారణం ఇదే.. తెలంగాణతో లింకు ఉన్న ఆ కేసు ఏంటంటే..?

Wait 5 sec.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, ఏఐసీసీ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌కు మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో ఊహించని షాక్ తగిలింది. స్క్రూట్నీ అనంతరం రిటర్నింగ్ అధికారి మంగళవారం (జూన్ 9న) తిరస్కరించారు. తెలంగాణలో తనపై ఉన్న ఒక వివాదాస్పద కేసు వివరాలను, ఆస్తుల సమాచారాన్ని అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగా దాచారని ప్రతిపక్ష బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తిరస్కరణ దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనంగా మారగా.. నామినేషన్ రిజక్ట్ కావటానికి కారణమైన కేసు వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.వాస్తవానికి మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి ప్రత్యక్ష క్రిమినల్ నేరారోపణలు లేవు. కానీ న్యాయస్థానంలో దాఖలైన ఒక క్రిమినల్ పిటిషన్‌కు సంబంధించి ఆమెకు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఈ కేసు నేపథ్యం ఒక మహిళా వేధింపుల వివాదంతో ముడిపడి ఉంది. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డి ఒక మహిళను లైంగికంగా వేధించడంతో పాటు, చంపుతానని బెదిరించారనే ఆరోపణలపై గతంలో 2022లో పంజాగుట్టలో, 2023లో బెంగళూరులోని కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైంది.బాధిత మహిళ నిందితుడైన శివకుమార్‌రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని అప్పటి రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రస్తుత మంత్రి వాకిటి శ్రీహరిల చుట్టూ తిరిగారు. శివకుమార్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని మీనాక్షి నటరాజన్ చెప్పినప్పటికీ.. దానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఇవ్వడానికి నిరాకరించారని సదరు మహిళ ఆరోపించారు. పైగా.. బెయిల్ రద్దయిన నిందితుడిని పార్టీ కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించారని, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డితో కలిసి ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ పరంగా తనకు న్యాయం జరగకపోవడంతో బాధితురాలు గత ఏడాది ఆగస్టు 28న హైదరాబాద్‌లోని నాల్గవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నిందితుడిపై చర్యలు తీసుకోనందుకు గాను మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్నికరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని తనకు రూ.10 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. మీనాక్షి నటరాజన్‌తో పాటు ఇతరులకు సమన్లు జారీ చేసింది. రాజ్యసభ నామినేషన్ అఫిడవిట్‌లో ఈ కోర్టు సమన్ల సమాచారాన్ని పేర్కొనకపోవటమే నామినేషన్ తిరస్కరణకు ప్రధాన కారణమైంది. ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ ఓటమికి భయపడి బీజేపీ కుట్రపూరితంగా ఈ పని చేయించిందన్నారు. నోటీసు ఇస్తే సమాధానం ఇచ్చేవాళ్లమని ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇలా ప్రత్యక్షంగా ఏ కేసులో లేకుండానే మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్ రిజెక్ట్ అయింది. ఆమె ఎంపీ స్థానానికే ఎసరు పెట్టింది. పాపం మీనాక్షీ నటరాజన్ పదవి వచ్చినట్లే వచ్చి తృటిలో చేజారిపోయింది.