రామ మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలే మారిపోయాయి. బీజేపీ తన చిరకాల కల అయిన రామ మందిరాన్ని 2024లో పూర్తి చేసింది. దేశం గర్వించదగ్గ స్థాయిలో, ప్రపంచం మనవైపు చూసేలా నిర్మించిన రామ మందిరాన్ని వీక్షించేందుకు సందర్శకులు పోటీ పడుతున్నారు. 2024లో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత అయోధ్య నగరానికి పర్యాటకుల రద్దీ భారీగా పెరిగింది. ఆలయ నిర్మాణంతో పాటు నగరంలో మౌలిక వసతులు కూడా కల్పించడంతో పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన వివరాల ప్రకారం 2020లో అయోధ్యను సందర్శించిన వారి సంఖ్య 60.22 లక్షలు ఉండగా.. 2024 నాటికి అది 16.44 కోట్లకు పెరిగింది. 2025 తొలి మూడు నెలల్లోనే 20 కోట్లకు పైగా సందర్శకులు వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. అయోధ్యకు సరైన రవాణా సౌకర్యం ఉండటం కూడా పర్యాటకుల సంఖ్య పెరగడంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ వివరాల ప్రకారం 2017లో అయోధ్యను 28.4 లక్షల మంది సందర్శించగా, 2022లో 2.39 కోట్ల మంది, 2023లో 5.79 కోట్ల మంది, 2024లో 16.44 కోట్ల మంది సందర్శించారు. 2025లో తొలి మూడు నెలల్లోనే ఆ సంఖ్య 20 కోట్లను దాటడం విశేషం. అయోధ్యకి పర్యాటకులు రావడానికి అనుకూలమైన రవాణా సౌకర్యం ఉంది. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను పునర్నిర్మాణం చేయగా, మహర్షి వాల్మికీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును కూడా ప్రారంభించారు. దాంతో అయోధ్యకు చేరుకోవడం చాలా ఈజీ అయింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాల నుంచి నేషనల్ హైవేలు కూడా ఉన్నాయి. పర్యాటకుల సంఖ్య పెరగడంతో వ్యాపార రంగాలు కూడా అభివృద్ధి చెందాయి. హోటల్ రంగం, రిటైల్ వ్యాపారాలు, రవాణా సేవలు, యాత్రికులకు సంబంధించిన సేవలు పెరిగాయి. ఐఐఎం లక్నో అధ్యయనం ప్రకారం రామ మందిరం ప్రారంభానికి ముందు ఒక్కో షాప్‌కి రోజుకు రూ. 400 - 500 ఆదాయం ఉంటే.. ఇప్పుడు సగటున రూ. 2,500 వరకు సంపాదిస్తున్నారని చెబుతున్నారు. రెండేళ్లలోనే ఐదు రెట్ల ఆదాయం పెరిగింది. అంతేకాకుండా అయోధ్య నుంచి సుమారు రూ. 400 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చినట్లు అధ్యయనం వెల్లడించింది.