నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలటం, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం.. ములుగు జిల్లా ఘన్‌పూర్, భూపాలపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 106.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా కుంటాలలో 69 మి.మీ, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 61.5 మి.మీ, ఆదిలాబాద్ జిల్లా తాళమడుగులో 50.5 మి.మీ మేర వర్షం కురిసింది. అలాగే నల్గొండ జిల్లా వేములపల్లిలో 45 మి.మీ, రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 41.8 మి.మీ, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 30.3 మి.మీ, మహబూబాబాద్ జిల్లా మారిపెడలో 20 మి.మీ చొప్పున వర్షపాతం రికార్డైంది.మంగళవారం సాయంత్రం హైదరాబాద్ మహానగరాన్ని వరుణుడు కమ్మేశాడు. ఆఫీసులు ముగిసి ఉద్యోగులు ఇళ్లకు తిరుగుప్రయాణమయ్యే సమయంలో కుంభవృష్టి ప్రారంభం కావడంతో నగర రోడ్లన్నీ క్షణాల్లో చెరువులను తలపించాయి. అత్యధికంగా మల్కాజిగిరి వినాయక్‌నగర్ వార్డు ఆఫీస్ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా.. బన్సీలాల్‌పేట్‌లో 8.75 సెం.మీ, హిమాయత్‌నగర్ విఠల్‌వాడీలో 7.9 సెం.మీ వర్షం కురిసింది. ఈ ఈదురుగాలుల బీభత్సానికి పాతబస్తీలో వీధిలైట్ల తీగ తెగిపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. చార్మినార్ సమీపంలోని చెత్తబజార్‌లో పాతకాలం నాటి కమాన్ స్వల్పంగా కూలిపోగా.. అంబర్‌పేట్, ముషీరాబాద్ పరిసరాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి.ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జామ్‌లతో స్తంభించిపోయాయి. గచ్చిబౌలి-కొండాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.45-మైండ్‌స్పేస్ మార్గాల్లో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి సైబర్ టవర్స్ వరకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ 6th ఫేజ్ రోడ్డుపై నడుములోతు నీరు చేరడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మణికొండ, నెక్నాంపూర్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపై వరద ఉధృతికి రాకపోకలు నిలిచాయి. మలక్‌పేట్ ఆర్‌యూబీ వద్ద మురుగునీటి పైపులైన్లు పొంగిపొర్లడంతో మెట్రో స్టేషన్ కింద రోడ్డు చెరువుగా మారింది. నేడు కూడా హైదరాబాద్ నగరంలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.