తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. సేవకులుగా ఛాన్స్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్కోండి

Wait 5 sec.

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అద్భుత అవకాశం కల్పిస్తోంది. తిరుమలలో శ్రీవారి సేవకులుగా అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే తొలి విడతగా శ్రీవారి సేవకులకు అవసరమైన శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు రెండో విడతగా శ్రీవారి సేవకుల కోసం శిక్షణను ప్రారంభించేందుకు సిద్ధమైంది.. జులై ఒకటి నుంచి శిక్షణ ప్రారంభించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో భాగంగా గతేడాది డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి 13 వరకు పది బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్, ఐఐఎం అహ్మదాబాద్‌ నిపుణులు గ్రూప్‌ సూపర్‌వైజర్లుగా శిక్షణ ఇచ్చారు. తాజాగా రెండో విడతలో ట్రైన్‌ ద ట్రైనర్స్‌ పేరుతో మరోసారి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 3వేల మందికి రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. ఇప్పటివరకు మొత్తం 1,200 మంది శ్రీవారిసేవకులుగా నమోదు చేసుకున్నారు. మొత్తం పది బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.. వీరిలో ఏడు బ్యాచ్‌లలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉంటారు. ఎనిమిదో బ్యాచ్ తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారు 9వ బ్యాచ్‌, మహారాష్ట్రకు చెందిన వారు 10 బ్యాచ్‌లో ఉంటారు. శ్రీవారి సేవకుల అర్హతకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్లో పొందుపరిచారు. శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకోవాలనుకుంటున్నవారు ఈ నెల 20వ తేదీలోపు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్లో నమోదు చేసుకోవాలని టీటీడీ తెలిపింది. మరోవైపు టీటీడీ ఆస్పత్రుల్లో శ్రీవారి వైద్య సేవ కార్యక్రమాన్ని గతవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. శ్రీవారి వైద్య సేవ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్‌ను టీటీడీ ఈవో రవిచంద్ర ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల సేవలను శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ వైద్య సేవను ప్రారంభించినట్లు తెలిపారు. ముందు ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని.. వైద్య సేవలో పాల్గొనే డాక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. అనంతరం వైద్య సేవను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాుబ సూచనలతో విద్య, వైద్యం, ఐటీ తదితర రంగాల్లో సేవా భావంతో ముందుకు వచ్చే నిపుణులకు టీటీడీ వేదికగా ఉందన్నారు. టీటీడీ ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో సేవలందించేందుకు వచ్చే వారందరికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృత స్థాయిలో అమలు చేసి ఎక్కువ మంది నిపుణుల సేవలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీవారి వైద్య సేవ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఐటీ అప్లికేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు, వైద్య నిపుణులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని.. తమకు అనుకూలమైన తేదీల్లో సేవలందించవచ్చన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు ఏడు రోజుల పాటు, సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులకు మూడు రోజుల పాటు స్వచ్ఛంద సేవ చేసే అవకాశం కల్పి్స్తామన్నారు. వీరి కోసం తిరుమల, తిరుపతిలో వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.టీటీడీకి సంబంధించిన అశ్విని ఆసుపత్రి, స్విమ్స్, బర్డ్ ఆసుపత్రి, ఆయుర్వేద ఆసుపత్రి, శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి, ఎస్వీ గోశాల, టీటీడీ అనుబంధ సంస్థల్లో వైద్య నిపుణులు తమ సేవలను అందించే అవకాశం ఉ:దన్నారు. హిందూ మతానికి చెందిన ఆసక్తి ఉన్న డాక్టర్లు.. ఆన్‌లైన్ ద్వారా టీటీడీ వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/srivari-seva/instructions లో తమ స్లాట్‌ను బుక్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు.