ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఈ జిల్లాల్లో వర్షాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడుతున్నాయి.. అలాగే కొన్ని జిల్లాల్లో ఎండలు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మంగళవారం రోజు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లోని పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడ్డాయి. కొన్నిచోట్ల గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ప్రజల్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఒక్కసారిగా వర్షం ప్రారంభమైతే చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ దగ్గర నిలబడొద్దని హెచ్చరించారు. ప్రజలు సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉరుములు వినిపిస్తే బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెట్లు, విద్యుత్ స్తంభాలకుదూరంగా ఉండాలంటున్నారు. మరోవైపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41-42డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉంది. మంగళవారం విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, పోలవరం, కాకినాడ జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 2 మండలాలు, కృష్ణా జిల్లాలో 3 మండలాలు.. ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో మండలంలో తీవ్ర వేడిగాలులు వీచాయి. మరోవైపు ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. మెల్లిగా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు విస్తరిస్తున్నాయి. ఈ వారంలోనే రాష్ట్రమంతా విస్తరిస్తాయంటున్నారు.