hyderabad rains: హైదరాబాద్‌లో భీకర వర్షం.. ఉరుములు, మెరుపులు.. సీఎం రేవంత్ విమానం బెంగళూరుకు మళ్లింపు

Wait 5 sec.

హైదరాబాద్‌లో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం వరకు ఎండ ఉండగా.. రాత్రి కూడా ఉక్కపోత నెలకొంది. ఈ క్రమంలోనే రాత్రి 9.30 గంటలకు అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది. ఆకాశం దట్టంగా మబ్బులు కమ్ముకుని.. కుంభవృష్టి వాన పడింది. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్ అయింది. రాత్రి పూట పనులు, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు.. ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి, వర్షంలో తడిసి ముద్దయ్యారు. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. నగరంలోని కూకట్‌పల్లి, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మైత్రివనం, ఖైరతాబాద్, లక్డీకాపూల్, బేగంపేట, ప్యారడైజ్, ప్యాట్నీ, జేబీఎస్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో సిగ్నళ్ల వద్ద చాలా దూరం వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీకెండ్ కావడంతో.. అమీర్‌పేట్, మైత్రివనం, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. ఆకస్మిక వర్షంతో చాలా మంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో.. మెట్రో స్టేషన్లలో భారీగా రద్దీ ఏర్పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ చౌరస్తా, కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్, చింతల్, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు.. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇవాళ తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న విమానం మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానుండగా.. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి నిరాకరించింది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.