మీ అబ్ప జాగీరా.. సిగ్గు లేదా.. మంత్రి సవితపై ఉష శ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు

Wait 5 sec.

కూటమి ప్రభుత్వ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీలో అధికార, విపక్షాలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించామంటూ కూటమి పార్టీలు సంబరాలు నిర్వహించగా.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదంటూ చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ శ్రేణులు నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో మంత్రి సవితమ్మపై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ అయ్య జాగీరా.. సిగ్గుందా నీకు అంటూ వ్యక్తిగతంగా విమర్శలకు దిగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత , స్థాయి సవితకు లేదన్న ఉషశ్రీ చరణ్.. సొంతమామకు వెన్నుపోటు పొడిచి మంత్రి పదవి దక్కించుకుందంటూ ఆరోపించారు. "నీ అబ్బ జాగీరా.. సవిత.. సొంత తల్లికి ద్రోహం చేసి, ఫోర్జరీ చేసి నాన్న ఆస్తిని లాక్కునే ప్రయత్నం చేశావ్. సొంత తల్లికే అన్నం పెట్టని నువ్వు.. అన్నపూర్ణ క్యాంటీన్ పెడతావా. నిన్ను నమ్మి వచ్చిన వాళ్లను దగా చేసి నట్టేట ముంచావ్. ఇదే పెనుకొండలో ప్రతీ బాటిల్ మీద రూ.10 తింటున్నావ్, తాగుతున్నావ్ సిగ్గులేదా నీకు.. బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. దీని గురించి మాట్లాడమంటే.. జగన్ మోహన్ రెడ్డి గారిని అంటావా నువ్వు. ఎవరు నువ్వు? నీ అర్హత ఏంది? మీ మామకు వెన్నుపోటు పొడిచి ఫోర్జరీ కొట్టి డబ్బు వస్తే నువ్వు మంత్రి అయ్యావ్. ప్రజల గుండెల్లో సంక్షేమ సామ్రాట్‌గా ఉన్నారు జగన్. ఇంకొక్కసారి జగన్ గురించి మాట్లాడితే తోలుతీస్తాం. వైసీపీ అంటే నీతి, నిజాయితీ. జగన్ రోడ్డు వేస్తే సిగ్గులేకుండా నువ్వు ఫ్లెక్సీలు వేయించుకుంటావా. " అంటూ మంత్రి సవితపై ఉషశ్రీ చరణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు ఉషశ్రీ చరణ్. అనంతరం వైఎస్ జగన్ మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2024 ఎన్నికల్లో ఉషశ్రీ చరణ్ నియోజకవర్గం మార్చారు వైఎస్ జగన్. పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో సవిత చేతిలో ఓటమి పాలయ్యారు ఉష శ్రీ చరణ్. ప్రస్తుతం పెనుగొండ వైసీపీ ఇంఛార్జిగా, శ్రీసత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే సవిత లక్ష్యంగా విమర్శలు కురిపిస్తు్న్నారు.