ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత.. నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణం చేయగా.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా కీలక బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. మరి కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారింది..? ఏయే విషయాల్లో కూటమి ప్రభుత్వం సానుకూల ఫలితాలు సాధించింది.. ఏయే హామీలు నెరవేర్చలేకపోయారు, ఇంకా ఏమేం చేయాల్సి ఉందనేది చూద్దాం.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన అతిపెద్ద మార్పు ఏపీ బ్రాండ్ వాల్యూ పెరగడం. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మద్దతు ఉంటుందని పారిశ్రామికవేత్తల్లో గట్టి నమ్మకం కలిగించడంలో కూటమి సర్కారు విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ బిజినెస్ విధానం చక్కటి ఫలితాలను ఇచ్చింది.ప్రభుత్వం నుంచి భరోసా లభించడం, కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండటంతో.. ఏపీకి గత రెండేళ్లలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రెండేళ్లలోనే దాదాపు 800 కంపెనీలు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబర్చాయి. సుమారు రూ. 23 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ రెండేళ్ల కాలంలో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో నాలుగో వంతు వాటా ఏపీకి దక్కడం విశేషం.అనకాపల్లిలో రూ. 1.35 లక్షల కోట్ల విలువైన ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టర్ స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన జరిగింది. రామాయపట్నంలో దాదాపు లక్ష కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. విశాఖలో లక్ష కోట్లకుపైగా విలువైన గూగుల్ డేటా సెంటర్‌కు సైతం శంకుస్థాపన జరిగింది. విజయనగరంలో రిలయన్స్ డేటా సెంటర్‌తోపాటు పుట్టపర్తిలో డిఫెన్స్ పరిశ్రమలు, కర్నూలులో డ్రోన్ సిటీ.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖపట్నానికి ఐటీ సంస్థలను తీసుకొచ్చేందుకు లోకేశ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.ఈ పరిశ్రమలన్నీ ఏర్పాటైతే, ఎంఓయూలు పెట్టుబడులుగా మారితే రాష్ట్రంలో 23 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇక ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే.. డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం.. 5757 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీని సైతం వేగవంతం చేసింది.2024 ఎన్నికల ముంగిట టీడీపీ సూపర్-6 పేరిట ప్రజలకు కీలక హామీలు ఇచ్చింది. అందులో భాగంగా సామాజిక ఫించన్లను రూ. 4 వేలకు పెంచారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఫించన్లను పంపిణీ చేస్తున్నారు. దీపం-2లో పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడంతోపాటు.. తల్లికి వందనం పథకం కింద పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా రూ. 15 వేలు చొప్పున జమ చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 20 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు.అయితే 18-59 ఏళ్ల వయసున్న ప్రతి మహిళకు ప్రతి నెలా రూ. 1500 చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు ఉద్దేశించిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నెలకు రూ. 3000 చొప్పున నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదు. ఈ రెండు పథకాలు అమలు చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం. ప్రభుత్వం దగ్గర సరిపడా నిధులు లేకపోవడంతో ఈ పథకాన్ని అమలు చేయలేకపోతున్నారు. అయితే బాబు మళ్లీ మాట తప్పారని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ విమర్శలు చేస్తోంది.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో గతంలో రోడ్ల మీద గుంతల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఫీలవుతున్నారు.ఏపీ రాజధాని అమరావతికి కూటమి ప్రభుత్వంలో మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట అమరావతిని పట్టించుకోలేదు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో నిర్మాణాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. 2014 నాటి విభజన చట్టానికి సవరణలు చేసిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించింది. దీంతో మూడు రాజధానుల ప్రతిపాదనకు చెక్ పెట్టినట్లయ్యింది. కేంద్రం కూడా అమరావతి అభివృద్ధి కోసం రూ. 15 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. రాజధాని ప్రాంతంలో పనులు తిరిగి ప్రారంభం కావడంతో.. అమరావతి పరిధిలోని 29 గ్రామాలతోపాటు, చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరిగాయి.కూటమి ప్రభుత్వం ఈగిల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు.ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులే పడ్డాయి. చంద్రబాబు ముందు చూపు, కేంద్రం వద్ద పరపతి పెరగడం.. పవన్ కళ్యాణ్ ప్రజాకర్షణ, కూటమిలో విబేధాలు రాకుండా సమన్వయం చేసుకోవడం.. పెట్టుబడుల కోసం లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో సానుకూలతను పెంచాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా.. రాష్ట్రాన్ని సరైన ట్రాక్‌లోకి మళ్లించారనే నమ్మకాన్ని కలిగించారు.అయితే సూపర్ సిక్స్ హామీల్లో మిగిలిపోయిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను అమలు చేయడం.. అమరావతి నిర్మాణాన్ని ఓ కొలిక్కి తీసుకురావడం, పోలవరం నిర్మాణం పూర్తి చేయడం లాంటి అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.