కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా ఉన్న ఓ నేత మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని కిషన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. కిషన్‌రెడ్డి బీజేపీలోనే ఉండి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సహాయం చేస్తారని కమలం పార్టీ నేతలే చెబుతున్నారని విమర్శించారు. ఇక తనను పార్టీలు మార్చే నేతగా ఆరోపణలు చేస్తున్న కిషన్‌రెడ్డిని విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి.. తాను ఏ పార్టీలో ఉన్నా.. ప్రజల కోసం పనిచేస్తానని తేల్చి చెప్పారు. ఇతర పార్టీల కోసం పనిచేయనని స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు రావడం లేదో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ ఉప్పల్‌ భగాయత్‌ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలని హితవు పలికారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్‌.. ఢిల్లీలో యమునా రివర్‌ఫ్రంట్‌ డెవలప్ చేశారని.. ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది ప్రక్షాళన చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నదులను ప్రక్షాళన చేశారని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు. అదే సమయంలో మూసీ నది ప్రక్షాళనను మాత్రం వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ తర్వాత తమ కార్యాచరణ మారుతుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు కేంద్రం అనుమతి ఇవ్వదో.. తెలంగాణలో మొత్తం ధాన్యాన్ని ఎందుకు కొనరో.. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు నిధులు ఎందుకు ఇవ్వరో.. మూసీ ప్రక్షాళనను ఎందుకు అడ్డుకుంటారో చూస్తామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో చేసే మంచి పనుల విషయంలో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) లోపలే దాదాపు 1.34 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. అంత జనాభాకు సదుపాయాలు కల్పించడమంటే అంత సులువు కాదని వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం కోసమే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ని 3 కార్పొరేషన్లుగా విభజించినట్లు గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తాము విభజించినట్లు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయంగా పడిపోయిన తనను మళ్లీ నిలబెట్టింది మల్కాజిగిరి ప్రజలేనని గుర్తు చేసుకున్న రేవంత్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోతే అప్పుడు ఎంపీగా అనుకున్న పనులు చేయలేకపోయానని.. కానీ ఇప్పుడు సీఎంగా మల్కాజిగిరిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నానని వెల్లడించారు.