హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు.. తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి భారీ విరాళం

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు కానుకలు, విరాళాల రూపంలో టీటీడీకి బంగారం, వెండి, డబ్బులు, విలువైన వస్తువులు, వాహనాలను అందిస్తుంటారు. కొంతమంది భక్తులకు తమకు వ్యాపారంలో లాభాలు రావడంతో.. తమకు తోచిన విధంగా స్వామివారికి కానుకలు, విరాళాల రూపంలో ఇస్తుంటారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్టులకు ఈ విరాళాలు అందజేస్తుంటారు.. వీటిని భక్తుల కోసం నిర్వహించే సామాజికసేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తుంటారు. తాజాగా బెంగళూరుకు చెంది ఓ భక్తుడు తనకు హోటల్ వ్యాపారంలో లాభాలు రావడంతో స్వామివారికి భారీగా విరాళం అందించారు. బెంగళూరుకు చెందిన శ్రీ వినాయక ఎంటర్‌ప్రైజెస్ ఎండీ మునిస్వామి నారాయణ గౌడ్ భారీ విరాళం అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.1.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడ్ని క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం అందించారు. మునిస్వామి నారాయణ గౌడ్ 1984లో హోటల్ వ్యాపారాన్ని ప్రారంభించి శ్రీవారి అనుగ్రహంతో అభివృద్ధి సాధించారు.. స్వామివారిపై భక్తి భావంతో ఈ విరాళాన్ని సమర్పిస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో జీవితంలో అభివృద్ధి సాధించిన భక్తులు తిరిగి శ్రీవారి సేవకు ముందుకు రావడం ఆనందదాయకమన్నారు నారాయణ గౌడ్. ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు ఆ తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పల్లమల సుధాకర్ అందించారు. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో.. ఛైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. శ్రీవారి సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు టీటీడీ ఛైర్మన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ధార్మిక, సేవా కార్యక్రమాలకు భక్తులు విశేషంగా సహకరించడం ఆనందంగా ఉందన్నారు.హైదరాబాద్‌కు చెందిన పురం సంజయ్ బాబు రూ.10 లక్షలు, హామి పెట్స్ అధినేత హనుమర హర్షవర్ధన్ రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలను టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళంగా అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్‌కు విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. తిరుమల శ్రీవారి అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.టీటీడీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ కార్యక్రమాలుమానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం, ఆరోగ్యకర జీవనశైలికి యోగాభ్యాసం ఎంతో ఉపయుక్తమని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాలపై తిరుమల శ్రీ పద్మావతి అతిథి భవనంలోని సుదర్మ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు ప్రతిరోజూ టీటీడీ ఆధ్వర్యంలో యోగా అవగాహన, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. యోగాభ్యాసం ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని తెలిపారు. అన్ని వయస్సుల వారిలో ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చేందుకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఈషా ఫౌండేషన్, పతంజలి యోగపీఠం, రామచంద్ర మిషన్, బ్రహ్మకుమారీస్, టీటీడీ ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రి సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.జూన్ 7 నుంచి 21 వరకు టీటీడీ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, యువత, వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులకు ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగా దినోత్సవానికే పరిమితం కాకుండా ఈ కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే యోగాపై ఆసక్తి, అవగాహన పెంపొందేలా విద్యాసంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 21న ఉదయం 6 గంటలకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమం అనంతరం వేలాది మంది పాల్గొనే యోగా అవగాహన ర్యాలీ నిర్వహించాలని సూచించారు.